ప్రజావ్యతిరేక విధానాలపై ఉద్యమం
నారాయణపేట: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై దేశవ్యాప్తంగా ఉద్యమం చేపట్టినట్లు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గోపాల్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి బండమీది బాల్‌రాం, రైతు సంఘం జిల్లా కార్యదర్శి అంజిలయ్యగౌడ్ అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. కేంద్రంలో 11 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం.. కార్మిక, కర్షక, కూలీల హక్కులను కాలరాయడమే కాకుండా రాష్ట్రాల హక్కులను హరించేలా కొత్త చట్టాలు చేస్తుందని విమర్శించారు. కార్మికులను కట్టుబానిసత్వంలోకి నెట్టేలా 4 లేబర్ కోడ్‌లను తీసుకొచ్చిందని విమర్శించారు. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో మోదీ ప్రభుత్వం వీబీజీ రాంజీ చట్టం తీసుకొచ్చి గ్రామీణ కూలీల పొట్ట కొట్టేందుకు కుట్రలు చేస్తోందన్నారు. ప్రజావ్యతిరేక చట్టాలతో పాటు జాతీయ విత్తన, విద్యుత్ సవరణ బిల్లులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్త ఉద్యమంలో భాగంగా ఈ నెల 17న జిల్లావ్యాప్తంగా జీపుజాతా నిర్వహించనున్నట్లు తెలిపారు. 19న కార్మిక, కర్షక ఐక్యత దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో పెద్దఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. కార్మికులు రైతులు, వ్యవసాయ కూలీలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
28 నుంచి
మన్యంకొండ జాతర
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ఈనెల 28 నుండి మార్చి 5 వరకు నిర్వహించనున్న మన్యంకొండ శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్ అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సోమవారం కలెక్టరేట్‌లోని మీటింగ్‌హాల్‌లో వివిధ శాఖల అధికారులతో కలిసి సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన తాగునీరు, శానిటేషన్, టాయిలెట్లు, బందోబస్తు రద్దీ నియంత్రణ వంటి సౌకర్యాలను కల్పించాలన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా వివిధ ముఖ్య శాఖల అధికారులతో ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ ఏర్పాటు చేసి ప్రతి శాఖ నుంచి ఒక అధికారిని నియమించి ఏర్పాట్ల పర్యవేక్షణ చేయాలని సూచించారు. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టం ఫిబ్రవరి 1న స్వామి వారి గరుడ వాహనసేవ, రథోత్సవం ఉంటాయని ఈ సందర్భంగా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలీస్‌శాఖ తరఫున అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని, ఆర్టీసీ తగినన్ని బస్సులు నడపాలని, కొండపైకి మినీ బస్సులు ఏర్పాటు చేయాలని సూచించారు.
ప్రజావ్యతిరేక విధానాలపై ఉద్యమం


