కోటి ఆశలతో.. సీఎం హామీలపై నూతన సంవత్సరంలోకి అడుగులు! | Sakshi
Sakshi News home page

కోటి ఆశలతో.. సీఎం హామీలపై నూతన సంవత్సరంలోకి అడుగులు!

Published Mon, Jan 1 2024 12:58 AM

- - Sakshi

నారాయణపేట: ‘కొడంగల్‌ ఎమ్మెల్యే తనను.. పేట ఎమ్మెల్యేగా పర్ణికారెడ్డిని గెలిపించి అసెంబ్లీకి పంపితే కొడంగల్‌, నారాయణపేటలను హైదరాబాద్‌ – సికింద్రాబాద్‌ జంటనగరాలు ఎలా అభివృద్ధి చెందాయో ఆ విధంగా రెండు నియోజకవర్గాలను అభివృద్ధి చేస్తా. కొడంగల్‌ అభివృద్ధికి నిధులు ఎలా మంజూరు చేస్తానో.. అదేవిధంగా నారాయణపేట నియోజకవర్గానికి ఇస్తా..’ అని ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అప్పటి టీపీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి మాటిచ్చారు.

రాష్ట్రంలో ఎన్నికలు ముగియడం.. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో రావడం.. ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడం.. కొడంగల్‌ నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారిస్తూ కొడంగల్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ (కాడా) పేరిట జీఓను విడుదల చేయించడం చకచకా జరిగిపోయాయి. ఈ క్రమంలో సీఎం ఇచ్చిన హామీలన్నీ కొత్త సంవత్సరంలో అమలు కావాలని.. పేట అభివృద్ధి పరుగులు తీయాలని.. అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు నూతన సంవత్సరంలో అడుగులు వేసి ప్రగతిలో పరుగులు తీయించాలని జిల్లా వాసులు ఆకాంక్షిస్తున్నారు. ఇదిలాఉండగా, 2023 సంవత్సరంలో జిల్లా అభివృద్ధి ఒక అడుగు ముందుకు.. ఒక అడుగు వెనక్కి పడినట్లయింది.

ఇండస్ట్రియల్‌ పార్క్‌లు..
జిల్లాలో ఉపాధి లేక ముంబయి, హైదరాబాద్‌, పూణె, బెంగళూర్‌ నగరాలకు వలస వెళ్లి జీవనోపాధి పొందుతున్నారు. నారాయణపేట జిల్లాలోని కొడంగల్‌ నియోజకవర్గం ఎమ్మెల్యే.. నూతన సీఎం ఎనముల రేవంత్‌రెడ్డి కావడంతో జిల్లాకు పరిశ్రమలకు పునాదులు పడుతాయని ఈ ప్రాంత వలసజీవులు ఆశాభావంతో ఉన్నారు. ఇండస్ట్రియల్‌ పార్కు, ఫుడ్‌ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటయితే ఈ ప్రాంతంలోని వలసజీవులకు ఇక్కడే జీవనోపాధి, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

  • ఎన్నికల ప్రచారంలో భాగంగా మక్తల్‌, ఆత్మకూర్‌ ప్రాంతాలను రెవెన్యూ డివిజన్లు చేయాలని జనం ఆకాంక్షించారు. ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీపై జనం ఎంతో ఆకాంక్షతో ఎదురుచూస్తున్నారు. నూతన ఏడాదిలో నారాయణపేట నియోజకవర్గంలో మూడు కొత్త మండలాలు గార్లపాడు, కానుకుర్తి, కోటకొండ మండలాలను ఏర్పాటు చేస్తూ జీఓ విడుదల అవుతుందనే శుభావార్త వినాలని కోరుకుందాం.
  • ఈ ప్రాంతంలో వ్యవసాయంపైనే ఆధారపడి ఎక్కువ కుటుంబాలు జీవిస్తుంటాయి. జాయమ్మ చెరువును నింపి సాగునీటిని అందించేందుకు పనులు ప్రారంభించాలని రైతులు ఆశాజనకంగా ఎదురుచూస్తున్నారు.

కలెక్టరేట్‌.. జిల్లా ఆస్పత్రికి పునాదులు..
జిల్లాకు ప్రధాన కార్యాలయమైన కలెక్టరేట్‌ భవన సముదాయంతో పాటు ఇతర కార్యాలయాలు, కలెక్టరేట్‌ కార్యాలయ సముదాయానికి రూ.55 కోట్లు, ఎస్పీ కార్యాలయానికి రూ.36 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఆయా భవనాల నిర్మాణాలకు ప్రభుత్వ భూములను గుర్తించి గతేడాది కలెక్టరేట్‌కు తాజా మాజీ మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా పనులు ప్రారంభమయ్యాయి. ఎస్పీ కార్యాలయానికి ఇంకా పునాదులు పడలేదు. కొత్త ఏడాదిలో నూతన ప్రభుత్వంలో పునాదులు పడుతాయని ఆశిస్తున్నారు. జిల్లా ఆస్పత్రి పనులు పూర్తయి, మెడికల్‌ కళాశాల ప్రారంభమై, విద్యార్థులకు వైద్య విద్యతో పాటు ప్రజలకు మెరుగైన వైద్యం అందాలని ఆకాంక్షిస్తున్నారు.

ఇవి చ‌ద‌వండి: అప్పులున్నా.. ఆరు గ్యారంటీలు మాత్రం ఆగవు : మంత్రి పొన్నం ప్రభాకర్‌

Advertisement
 
Advertisement
 
Advertisement