పారదర్శకంగా ఓట్ల లెక్కింపు | - | Sakshi
Sakshi News home page

పారదర్శకంగా ఓట్ల లెక్కింపు

Feb 13 2026 5:48 AM | Updated on Feb 13 2026 5:48 AM

పారదర్శకంగా ఓట్ల లెక్కింపు

పారదర్శకంగా ఓట్ల లెక్కింపు

కోస్గిరూరల్‌/కొత్తపల్లి(మద్దూర్‌): మున్సిపల్‌ ఎన్నికల్లో పోలైన ఓట్ల లెక్కిపును అత్యంత పారదర్శకంగా చేపట్టాలని, ఎలాంటి పొరపాట్లకు తావివ్వొద్దని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ అన్నారు. గురువారం కోస్గి ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కళాశాల, మద్దూర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఏర్పాటుచేసిన కౌంటింగ్‌ కేంద్రాలను ఆమె పరిశీలించి మాట్లాడారు. కోస్గి, మద్దూరులో 16 వార్డుల చొప్పున ఉండగా.. రెండు రౌండ్లుగా విభజించినట్లు తెలిపారు. మొదటి రౌండ్‌లో 1–8 వార్డులు, రెండో రౌండ్‌లో 9–16 వార్డుల ఓట్ల లెక్కింపునకు 8 చొప్పున టేబుల్స్‌ ఏర్పాటు చేశామని వివరించారు. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని.. మధ్యాహ్నం 1గంట వరకు పూర్తి ఫలితాలు వెలువడుతాయని తెలిపారు.

● ఓట్ల లెక్కింపు ప్రక్రియ విధి విధానంపై మద్దూరులో ఆర్‌ఓలు, ఏఆర్‌ఓలు, కౌంటింగ్‌ సూపర్‌వైజర్లు, అసిస్టెంట్లకు ఏర్పాటుచేసిన శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్‌ హాజరై పలు సూచనలు చేశారు. ఓట్లను లెక్కించే సమయంలో పార్టీ అభ్యర్థులు, ఏజెంట్లకు స్పష్టంగా చూయించి.. చెల్లుబాటయ్యే ఓట్లు, చెల్లు బాటు కాని ఓట్లను జాగ్రత్తగా పరిశీలించాలన్నారు. రిటర్నింగ్‌ అధికారి ఒకసారి ఏదేని ఓటును చెల్లని ఓటుగా నిర్ధారిస్తే.. మళ్లీ ఆ ఓటును పరిగణనలోకి తీసుకోకూడదని చెప్పారు. అభ్యర్థులు ఏమైనా కారణాలతో లిఖిత పూర్వకమైన నోటీసు ఇస్తేనే రీ కౌటింగ్‌పై నిర్ణయం తీసుకోవాలని.. దీనిపై తుది నిర్ణయం రిటర్నింగ్‌ అధికారిదేనని స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపు విధులకు వచ్చిన ఉద్యోగులకు రాత్రి బస ఏర్పాటుచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ వెంట మున్సిపల్‌ ప్రత్యేకాధికారి, డీఆర్డీఓ మొగులప్ప, ఎన్నికల అధికారులు నాగరాజు, శ్రీకాంత్‌, తహసీల్దార్‌ శ్రీనివాసులు, మున్సిపల్‌ మేనేజర్‌ అనిల్‌కుమార్‌ ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement