కొలిమిగుండ్ల (అవుకు): విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్‌పై దాడి చేసిన వ్యక్తికి బనగానపల్లె కోర్టు గురువారం రూ.5వేలు జరిమానా విధించింది. అవుకు మండలం గుండ్లశింగవరం ఉన్నత పాఠశాలలో 2019 సెప్టెంబర్ 1వ తేదీన మహిళా అభ్యర్థులకు సచివాలయ పరీక్షలు నిర్వహించారు. ఆ సమయంలో పరీక్షా కేంద్రం వద్ద పోలీసులు 144 సెక్షన్ అమలు చేశారు. అవుకు పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ సూర్యప్రకాష్ అక్కడ బందోబస్తు విధుల్లో ఉన్నాడు. నంద్యాల మండలం మునగాల గ్రామానికి చెందిన గోవిందిన్నె వెంకటేశ్వరరెడ్డి పరీక్ష రాస్తున్న భార్య ఉంటున్న గదిలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా విధుల్లో ఉన్న గ్రామ వలంటీర్ తిరుమలేష్, కానిస్టేబుల్ సూర్యప్రకాష్ అడ్డుకొని లోనికి అనుమతి లేదని బయటకు వెళ్లాలని సూచించారు. అయితే కానిస్టేబుల్ మాటలను లెక్క చేయకుండా వెంకటేశ్వరరెడ్డి ఘర్షణకు దిగి యూనిఫాంలో ఉన్న కానిస్టేబుల్ కాలర్ పట్టుకొని విధులకు ఆటంకం కలిగించాడు. ఈ ఘటనకు సంబంధించి అప్పట్లోనే కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ శ్రీకాంత్‌రెడ్డి కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేసి కోర్టులో చార్జీషీట్ దాఖలు చేశారు. ఈ కేసుపై కోర్టులో విచారణ పూర్తి కాగా బనగానపల్లె కోర్టు న్యాయమూర్తి వెంకటేశ్వరరెడ్డిని దోషిగా నిర్దారించి రూ.5వేలు జరిమానా విధిస్తూ తుది తీర్పు ప్రకటించారు.
అనారోగ్యంతో మహిళా ఏఎస్‌ఐ మృతి
కర్నూలు: కర్నూలు పోలీస్ కంట్రోల్ రూమ్‌లో(పీసీఆర్) ఏఎస్‌ఐగా పనిచేస్తున్న నిమ్మిపాటి లక్ష్మిదేవి(58) అనారోగ్యంతో మృతిచెందారు. ఈమె స్వస్థలం కల్లూరు మండలంలోని పుసులూరు బొల్లవరం. 1991లో లక్ష్మిదేవి కానిస్టేబుల్‌గా పోలీసు శాఖలో చేరారు. ఏడాది కాలంగా షుగర్ వ్యాధితో బాధ పడుతుండగా.. ఇటీవల షుగర్ అధికమై కాలి పాదం తొలగించారు. ఇదే సమయంలో వైద్యపరీక్షలు నిర్వహించగా క్యాన్సర్ ఉన్నట్లు బయటపడింది. దీంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించి చికిత్స చేయించారు. కోలుకోలేక గురువారం మృతి చెందారు. సాయంత్రానికి మృతదేహం కర్నూలుకు తీసుకొచ్చారు. సుంకేసుల రోడ్డులోని హిందూ స్మశాన వాటికలో శుక్రవారం పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
నాటుసారా స్థావరాలపై దాడులు
బనగానపల్లె రూరల్: బనగానపల్లె ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలోని పలు గ్రామాల్లో నాటుసారా స్థావరాలపై నంద్యాల ఎకై ్సజ్ సూపరింటెంట్ టాస్క్ ఫోర్స్ (ఈఎస్‌టీఎఫ్) సీఐ లక్ష్మణ్‌దాస్ ఆధ్వర్యంలో గురువారం దాడులు జరిగాయి. పసుపల తండా, చిన్నరాజుపాళెం, తండా గ్రామాల్లో నాటుసారా తయారీ అనుమానితుల ఇళ్లలో తనిఖీ చేయడంతో పాటు అలేబాద్‌తండా గ్రామంలోని కొండల్లో నాటుసారా తయారీకి మూడు డ్రమ్ముల్లో సిద్ధంగా ఉన్న బెల్లం ఊటను ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని జిల్లా డీపీఈఎస్‌వో, ఏఈఎస్ ఆదేశాల మేరకు ఈ దాడులు నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో టాస్క్‌ఫోర్స్ సిబ్బంది ఓబులేసు, నాగరాజు, డీవీ కృష్ణయ్య, రవికుమార్, పాములేటి తదితరులు పాల్గొన్నారు.
గుర్తుతెలియని వ్యక్తి దుర్మరణం
ఓర్వకల్లు: మండలంలోని సోమయాజులపల్లె గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై గురువారం గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. స్థానిక ఇండియన్ ఆయల్ పెట్రోల్ బంక్ ఎదురుగా రోడ్డుదాటుతుండగా తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో గుర్తు తెలియని వాహనం ఢీక్టొంది. గుర్తుతెలియని వ్యక్తి అక్కడిక్కడే మృతిచెందాడు. మృతుడి వయస్సు సుమారు 30–35 ఏళ్ల మధ్య ఉంటుంది. కుడిచేతికి పచ్చబొట్టు ఉంది. మృతదేహాన్ని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, మార్చురీ గదిలో భద్రపరచినట్లు పోలీసులు తెలిపారు.
కొమరం భీం జయంతి
శ్రీశైలంప్రాజెక్ట్: గిరిజన హక్కుల పోరాటధీరుడు కొమరంభీం జయంతి శ్రీశైలం ప్రాజెక్ట్‌లో గురువారం నిర్వహించారు. అంబేడ్కర్ సెంటర్‌లో కొమరం భీం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొమరం భీం ఆదివాసి చెంచు గిరిజన సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షుడు వై.ఆశీర్వాదం మాట్లాడుతూ.. బ్రిటీష్ పాలకులు పెట్టుబడిదారి తనంతో హక్కులను కాలరాస్తుంటే గిరిజనుల హక్కుల కోసం పోరాడిన ధీరుడు కొమరంభీం అని అన్నారు. గిరిజన సంక్షేమ సంఘం నాయకులు లక్ష్మి, చెవుల మల్లికార్జున, కుడుముల చిన్నోడు, బసవయ్య తదితరులు పాల్గొన్నారు.


