కల్లూరు: స్థానిక సంస్థల ఎన్నికల వేళ నియోజకవర్గ వ్యాప్తంగా టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి వలసలు ఊపందుకున్నాయి. గురువారం పాణ్యం నియోజకవర్గంలోని కల్లూరు మండలం తడకనపల్లె గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరారు. గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకులు కృష్ణారెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, చిన్న స్వాములు, శ్రీను, సోమన్న ఆధ్వర్యంలో ఆ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి సమక్షంలో అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు కె.చిన్న రాముడు, కె. బాలన్న, కె.ఏళ్లకృష్ణ, కె.చిన్నలక్ష్మన్న, లక్ష్మన్న, ఓబుళాపురం మౌలాలి, అయ్యస్వామి, చిన్న మాశన్న, మక్బుల్ బాషాకు కాటసాని రాంభూపాల్‌రెడ్డి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కాటసాని మాట్లాడుతూ స్థానిక సంస్థలు ఎన్నికల్లో సమష్టిగా పనిచేసి పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని సూచించారు.


