● భవిష్యవాణి వినిపించిన ఆలయ పూజారి
హొళగుంద: వర్షాలు ఉండవని, ఆకాశం మేఘావృతం అయినా ఆశలు పెంచుకోవద్దని, ధరలు పెరుగుతూనే ఉంటాయని, తగ్గే పరిస్థితి ఉండబోదని పూజారి తన కార్ణీకంలో వివరించారు. దేవరగట్టు దసరా బన్ని ఉత్సవంలో ఆలయ పూజారి గిరిస్వామి బసవన్నగుడి పైకెక్కి డిర్ర్‌ర్ర్‌ర్ర్.. బహుపరక్ అంటూ భవిష్యవాణి వినిపించాడు. మల్లెగువ్వే ఇందే గంగి, మాళ నింతాళ హెచ్చర.. 7,900 నగెళ్లే..(పత్తి).. 3,400 ఒక్కళచోళ(జొన్న).. 3–6, 6–వర్ణాదితు ..అని అన్నారు. మల్లెపూవులా కనిపించినా అది మల్లె పూవు కాదని, వర్షాలు వచ్చినట్టే కనబడ్తున్నా వర్షాలు కురవవని, మంచితనం ముసుగులో కనబడని చెడు దాగి ఉంటుందని హెచ్చరా అనే అర్థంతో భవిష్యవాణి ఉన్నట్లు పలువురు పెద్దలు తెలిపారు. అలాగే పత్తి రూ.7,900, జొన్న రూ.3,400 ధర పలుకుతుందని, ఆహార పదార్థాలు, నిత్యావసర సరకులు, పంటలకు గిట్టుబాటు ధర తక్కువ నుంచి పెరిగి ఇంకా పెరుగుతూనే ఉంటుందని తెలియజేసేలా 3:6, 6–వర్ణాదితు అని భవిష్యవాణిని వినిపించి ముగించాడు.


