● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి
కర్నూలు (టౌన్): అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిద్దామని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. కర్నూలు 28వ వార్డు పరిధిలోని శ్రీరామనగర్, సీ.క్యాంపు క్వార్టర్స్, మద్దుర్‌నగర్ ప్రాంతాల్లో గురువారం వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థి సుశీల, కార్పొరేటర్ అభ్యర్థి బత్తుల రీటా స్వర్ణలతతో కలిసి పార్టీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు ఎస్వీ విజయ మనోహరి, కర్నూలు పార్లమెంటరీ ఇన్‌చార్జ్ బుట్టా రేణుక ప్రచారం చేశారు. ఇంటింటికీ తిరిగి చంద్రబాబు మోసాలు వివరించారు. ఆడబిడ్డ నిధి ఇచ్చారా.. 50 సంవత్సరాలు దాటితే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలందరికీ రూ. 4 వేలు పెన్షన్ ఇచ్చారా.. అని ఓటర్లను అడిగారు. చంద్రబాబు మాటలు నమ్మి మోసపోయామని ప్రజలు చెప్పారు. ఈ సందర్భంగా ఎస్వీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇచ్చిన ప్రతి హామీని జగనన్న అమలు చేస్తే, ఎన్నో అబద్ధాలు చెప్పి చంద్రబాబు అధికారంలోకి వచ్చారన్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్లు ఎగొట్టారన్నారు. పేదలను, సామాన్యులను, మధ్య తరగతి ప్రజలను, మహిళలను మోసం చంద్రబాబును ఓడిద్దామన్నారు. ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేస్తుంటే చంద్రబాబుకు ఎందుకంత భయమని ప్రశ్నించారు. ప్రజలు ఆలోచించాలని, సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేసిన వైఎస్సార్‌సీపీ మేయర్, కార్పొరేటర్ అభ్యర్థులను ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలన్నారు.


