నంద్యాల(అర్బన్): జిల్లాలోని 28 జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి గురువారం రెండవ రోజు 76 నామినేషన్లు దాఖలు అయినట్లు జెడ్పీ సీఈఓ శివశంకర్ తెలిపారు. అందులో వైఎస్సార్‌సీపీ నుంచి 29 మంది నామినేషన్లు దాఖలు కాగా టీడీపీ 22, కాంగ్రెస్ 11, జేఎస్పీ 4, బీజేపీ 3, సీపీఐ 4, ఇండిపెండెంట్లు ముగ్గురు నామినేషన్ వేసినట్లు తెలిపారు. హోరాహోరీగా నామినేషన్లు వేస్తుండటంతో పోటీ రసవత్తరంగా మారే అవకాశం ఉంది.
కలెక్టర్ ఫొటోతో డబ్బు డిమాండ్ చేస్తే చర్యలు
నంద్యాల(న్యూటౌన్): తన ప్రొఫైల్ ఫొటోను దుర్వినియోగం చేస్తూ డబ్బు డిమాండ్ చేసే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రాజకుమారి హెచ్చరించారు. తన ఫొటోతో 9713588183 నంబర్ నుంచి డబ్బు కోరుతూ సందేశాలు వస్తున్న నేపథ్యంలో ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు, మీడియా ప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ గురువారం ఒక ప్రకటనలో సూచించారు. ఇటువంటి సందేశాలను నమ్మి డబ్బులు బదిలీ చేయవద్దని, సంబంధిత నంబర్‌ను బ్లాక్ చేసి, ఆధారాలతో పోలీసులకు, సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేయాలన్నారు. విచారణలో సైబర్ మోసం నిర్ధారణ అయితే బాధ్యులపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
‘రైల్ జన్ సంవాద్’తోసమస్యల పరిష్కారం
డోన్ రూరల్: ‘రైల్ జన్ సంవాద్’తో కార్యక్రమంతో రైలు ప్రయాణికుల సమస్యల పరిష్కారమవుతాయని గుంతకల్ డివిజన్ అధికారి రవి సుమ్మి కుమార్ అన్నారు. స్థానిక రైల్వే స్టేషన్‌లో గురువారం రైల్ జన్ సంవాద్ (రైల్యే ప్రజా వేదిక) కార్యక్రమం నిర్వహించారు. గుంతకల్ డివిజన్ అధికారి రవి సుమ్మి కుమార్ ముఖ్య అతిథిగా హాజరు కాగా, ఏడీఈఎన్ బ్రహ్మారెడ్డి, స్టేషన్ మేనేజర్ ప్రమోద్, ఆర్‌పీఎఫ్ సీఐ నాగభూషణ, చీఫ్ హెల్త్ ఇన్‌స్పెక్టర్ విజయ్ కుమార్, సీసీఎల్ చంద్రశే ఖర్, సీఎల్‌ఐ మునిస్వామి ప్రయాణికులతో నేరుగా మాట్లా డారు. ఈ సందర్భంగా ప్లాట్‌ఫారం నంబర్ 1 గుంతకల్లు వైపు మెయిన్ ఎంట్రెన్స్ వద్ద అదనపు ఆర్‌ఓ తాగునీటి సదుపాయం కల్పించాలని, ప్రత్యేక వెయిటింగ్ హాళ్లు రిటైరింగ్ రూములు ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే వృద్ధులు, దివ్యాంగుల సౌకర్యార్థం ప్లాట్‌ఫారంపై ఎస్కలేటర్, ర్యాంప్, లిప్ట్‌లు అమర్చాలని, టాయిలెట్ల సంఖ్య పెంచాలని ప్రయాణికులు తెలిపారు. ప్రయాణికుల ప్రతి సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కారిస్తామని వారు హామీ ఇచ్చారు.
నేడు కర్నూలుకు ఆప్కాబ్ ఎండీ
కర్నూలు(అగ్రికల్చర్): ఆంధ్రప్రదేశ్ సహకార బ్యాంకు(ఆప్కాబ్) మేనేజింగ్ డైరెక్టర్ రామకృష్ణయ్య ఈ నెల 23న కర్నూలుకు రానున్నారు. ఉమ్మడి జిల్లా సహకార కేంద్ర బ్యాంకును ఆయన తనిఖీ చేయనున్నారు. అదే విధంగా బ్యాంకు సాగిస్తున్న పాలన వ్యవహారాలు, రుణాల పంపిణీ, రికవరీలు, ఎన్‌పీఏ తదితరాలపై కర్నూలులోని ప్రధాన కార్యాలయంలో సమీక్ష నిర్వహిస్తారని డీసీసీబీ సీనియర్ అధికారులు తెలిపారు.
క్వింటా ఉల్లి రూ.4,454
కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉల్లి ధరలు పెరుగుతున్నాయి. మార్కెట్‌కు 938 క్వింటాళ్లు(40 లాట్లు) వచ్చాయి. కనిష్ట ధర రూ.3,419, గరిష్ట ధర రూ.4,454 లభించగా.. సగటు ధర రూ.3,419 నమోదైంది. ఈ సారి మొక్కజొన్న పంట అతి తక్కువగా ఉంది. మార్కెట్‌కు కేవలం 10 క్వింటాళ్లు మాత్రమే మొక్కజొన్నలు వచ్చాయి. క్వింటాకు రూ.2,701 ధర లభించింది. వేరుశనగకు కనిష్ట ధర రూ.5,598, గరిష్ట ధర రూ.8,089 లభించగా.. సగటు ధర రూ.7299 నమోదైంది. మార్కెట్‌లో మిర్చికి అంతంతమాత్రం ధరలే లభిస్తున్నాయి. ఎరుపు రకం కనిష్ట ధర రూ.13,259 లభించగా.. గరిష్ట ధర రూ.17,239.. సగటు ధర రూ.15,599 పలికింది.


