● సంతకాల ఫోర్జరీ దొంగల పని
● మాజీ ఎమ్మెల్యే
శిల్పా రవిచంద్రకిషోర్‌రెడ్డి
బొమ్మలసత్రం: ఎన్నికల్లో ఓటమి తప్పదని భావించి అభ్యర్థుల సంతకాలు ఫోర్జరీ చేసి ఏకగ్రీవంగా గెలిచామని చెప్పుకోవడానికి టీడీపీ నేతలు సిగ్గుపడాలని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్‌రెడ్డి విమర్శించారు. గురువారం ఆయన నివాసంలో ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా ఆధ్వర్యంలో ఎస్‌డీపీఐ, ఐయూఎంఎల్ పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి మాట్లాడుతూ.. నంద్యాల పట్టణంలో 51వ వార్డు వైఎస్సార్‌సీపీ అభ్యర్ధి నాగమణి సంతకాన్ని ఫోర్జరీ చేసి టీడీపీ ఏకగ్రీవమైందని చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. సుప్రీం కోర్టు చొరవతో రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ తాత్కాలికంగా నిలిపివేసిన సంఘటనలు చరిత్రలో ఎప్పుడూ ప్రజలు చూడలేదన్నారు. ఓటమికి భయపడి నామినేషన్ ప్రక్రియ నుంచి విత్‌డ్రాల వరకూ టీడీపీ నేతలు దౌర్జన్యాలకు తెగబడటం అందరూ గమనిస్తున్నారన్నారు. అధికారంలోకి రాకముందు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనకు మించి సంక్షేమ పథకాలు అందిస్తామని కూటమి నేతలు ఆడంబరాలు పలికి చివరకు చేతులెత్తేశారన్నారు. అధికారం చేపట్టిన తర్వాత సంక్షేమాన్ని విస్మరించి నిత్యావసరాలు, పెట్రోల్ రేట్లు పెంచారన్నారు. రైతులకు సాగునీరు అందించలేని దుస్థితికి దిగజారిందన్నారు. పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అన్ని వ్యవస్థలను ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వాడుతోందన్నారు. వక్ఫ్ ఆస్తులను ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు కట్టబెట్టడాన్ని ఎస్‌డీపీఐ తీవ్రంగా ఖండించిందని ఆపార్టీకి తాము ఎప్పుడూ మద్దతుగా ఉంటామన్నారు. పట్టణంలోని 5, 6, 7 వార్డులకు గాను ఎస్‌డీపీఐ నాయకులు మజూద్‌ఖాన్, పూల జరీనా, అజాస్‌హుస్సేన్‌లను వైఎస్సార్‌సీపీ అభ్యర్థులుగా పోటీలో నిలబెడుతు న్నామన్నారు. అనంతరం ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని అభివృధి పథంలో నడిపే పార్టీలతో ఎస్‌డీపీఐ జతకడుతోందన్నారు. ఇదే క్రమంలో వైఎస్సార్‌సీపీ తరఫున ఎస్‌డీపీఐ నాయకులు ఫ్యాన్‌గుర్తుతో పోటీ చేస్తున్నారన్నారు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కోసం పోరాడే ఎస్‌డీపీఐ నాయకులను ప్రజలు ఆశీర్వదించాలని కోరారు.


