నామినేషన్లు అడ్డుకుంటే ఊరుకోం | - | Sakshi
Sakshi News home page

నామినేషన్లు అడ్డుకుంటే ఊరుకోం

Oct 22 2026 7:02 AM | Updated on Oct 22 2026 7:02 AM

● మాజీ ఎమ్మెల్యే శిల్పా,

సీఈసీ మెంబర్‌ పీపీనాగిరెడ్డి

నంద్యాల(అర్బన్‌): కూటమి ప్రభుత్వంలోని పోలీసు యంత్రాంగం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌ రెడ్డి, వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు పీపీనాగిరెడ్డి, గోస్పాడు మండల వైఎస్సార్‌సీపీ నేత, శ్రీశైలం నియోజకవర్గ పరిశీలకులు పీపీ మధుసూదన్‌ రెడ్డి మండిపడ్డారు. గోస్పాడు మండలంలో ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసేందుకు వెళ్తున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను పోలీసులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న శిల్పారవి, పీపీ నాగిరెడ్డి గోస్పాడుకు చేరుకొని పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థులను మరుసటి రోజు నామినేషన్లు వేయాలంటూ ఎస్‌ఐ సుధాకర్‌రెడ్డి అడ్డుకోవడమేమిటని ప్రశ్నించారు. ఇంతకు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? అని పోలీసు అధికారులను నిలదీశారు. భారత రాజ్యాంగం అర్హత కలిగిన ప్రతి పౌరుడికి ఎన్నికల్లో పోటీ చేసే హక్కు కల్పించిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ హక్కులను కాలరాస్తోందని మండిపడ్డారు. ప్రస్తుతం పోలీసులు వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్య వ్యవస్థకే గొడ్డలిపెట్టుగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. నామినేషన్ల దాఖలును అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిపై ఎన్నికల కమిషన్‌ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అనంతరం పోలీసుల ఆంక్షలను దాటుకుని వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను వెంటబెట్టుకుని వెళ్లి ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేయించారు.

జెడ్పీటీసీ స్థానాలకు 9 నామినేషన్లు

నంద్యాల(అర్బన్‌): జిల్లాలో జెడ్పీటీసీ స్థానాలకు తొలి రోజు బుధవారం 9 నామినేషన్లు వచ్చాయి. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కేంద్రంలో జూపాడుబంగ్లా, పాములపాడు, బేతంచెర్ల, నంద్యాల, ప్యాపిలి తదితర మండలాల నుంచి ముగ్గురు టీడీపీ అభ్యర్థులు, ఇద్దరు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, బీజేపీ, సీపీఐ, జనసేన, ఇండిపెండింట్‌ అభ్యర్థులు ఒక్కొక్కరు చొప్పున నామినేషన్లు దాఖలు చేసినట్లు సీఈఓ కార్యాలయ ఏఓ నాగరాజు తెలిపారు.

దరఖాస్తు గడువు పొడిగింపు

శ్రీశైలం: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం శ్రీశైలం ప్రాంగణంలో ఎంఏ చరిత్ర, సంస్కృతి పురావస్తు శాఖ కోర్సులో 2026– 2027 విద్యా సంవత్సరం ప్రవేశానికి దరఖాస్తు గడువు ఈనెల 26 వరకు పొడిగించినట్లు విశ్వవిద్యాలయం రిజిస్టార్‌ ముసుగు శ్రీనివాసరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు teluguuniversityap.in ను సంప్రదించాలని సూచించారు.

శ్రీశైలంలో సిఫార్స్‌ లేఖలు స్వీకరించబడవు

శ్రీశైలంటెంపుల్‌: రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి (మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌) అమ లులో ఉన్నందున శ్రీశైల దేవస్థానంలో వసతి ఏర్పాట్లు, స్వామి అమ్మవార్ల దర్శనానికి సంబంధించి ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవ ని శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీ నివాసరావు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.

ఒండుట్లలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడి

గడివేముల: ఒండుట్ల గ్రామంలో మంగళవారం వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. జమ్మిచెట్టు పూజకు వెళ్తుండగా జరిగిన ఈ ఘటనలో దోర్నాల గోరంట్లకు తీవ్ర గాయాలు కాగా, దోర్నాల మహేష్‌, దోర్నాల మద్దమ్మ, చిన్న రంగస్వామికి గాయాలయ్యాయి. వీరు ప్రస్తుతం కర్నూలు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామభూపాల్‌ రెడ్డి కర్నూలులోని అమీలియో ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చి, ధైర్యం చెప్పారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కాటసాని వెంట వైఎస్‌ఆర్‌ సీపీ నాయకులు రవీంద్రనాథ్‌ రెడ్డి, తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement