ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డలో ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయం కాస్త తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని తలపించింది. మునిసిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ రోజైన బుధవారం ఆళ్లగడ్డ పురపాలక ఎన్నికల కార్యాలయం సాక్షిగా పచ్చ మూకలు బరితెగించాయి. ఉదయం నుంచి వందలాది మంది టీడీపీ శ్రేణులు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన రౌడీ మూకలు కార్యాలయాన్ని పూర్తిగా తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. లోపల ఏం జరుగుతుందో బయట అభ్యర్థులకు గాని, మీడియాకు గాని కడకు ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ పోలీసులకు కూడా తెలియకుండా రాత్రి పొద్దుపోయేవరకు పూర్తిగా తమ అదుపులోనే ఉంచుకుని పచ్చ సామ్రాజ్యాన్ని నడిపించారు.
పచ్చ చొక్కా వేసుకున్న ఖాకీలు..
ఈ మొత్తం హై డ్రామాలో పోలీసుల వ్యవహార శైలి అత్యంత వివాదాస్పదంగా మారింది. శాంతి భధ్రతలు కాపాడుతూ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు పూర్తి రక్షణ కల్పించాల్సిన పోలీసులు కేవలం టీడీపీకి చెందిన వారిని లోపల ఉంచి కార్యాలయాన్ని పూర్తిగా వారికి అప్పగించడం ఒక ఎత్తైతే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారిని అడ్డుకునే సమయంలో సాక్షాత్తు రౌడీ షీటర్లకు పోలీస్ డ్యూటీలు అప్పగించినట్లుగా వ్యవహరించారు. ఈ దృశ్యాలు చూసిన స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు.
నిప్పులు చెరిగిన మాజీ ఎమ్మెల్యే
వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల బీ ఫాంలు లోపలకు తీసుకువెళ్లనివ్వడం లేదన్న విషయం తెలిసిన మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి హుటాహుటిన ఎన్నికల కార్యాలయానికి చేరుకున్నారు. పోలీసులు ఆయనను సమయం మించిపోయిందని చెబుతూ కార్యాలయంలోకి వెళ్లకుండా బారీకేడ్లకు అవలివైపునే ఆపారు. అంతలో ఎన్నికల కార్యాలయం నుంచి పోలీస్ అధికారులతో కలిసి వచ్చిన టీడీపీకి చెందిన కొందరు రౌడీషీటర్లు లోపలికి రాకూడదు అంటూ అడ్డుగా నిలబడి మాజీ ఎమ్మెల్యేను అడ్డుకునే ప్రయత్నం చేశారు. వందలాది మంది టీడీపీ శ్రేణులు లోపల తిరుగుతుంటే నియోజకవర్గ మాజీ ప్రజాప్రతినిధి అయిన తనను నిలువరిస్తారా అని అధికారుల పక్షపాతంపై గంగుల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రౌడీ షీటర్లతో కలిసి వచ్చిన పోలీసులపై నిప్పులు చెరిగారు. ఇది ప్రభుత్వ కార్యాలయమా ? లేక టీడీపీ ఆఫీసా ? రౌడీషీటర్లతో పోలీస్ డ్యూటీ చేయిస్తున్నారంటూ మండిపడ్డారు. గంగుల అభ్యంతరంతో రంగంలోకి దిగిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు అక్కడ భారీగా మోహరించి పోలీసులు, అధికారుల ఏకపక్ష ధోరణికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
ఎన్నికల కార్యాలయాన్ని పూర్తిగా
తమ ఆధీనంలోకి తీసుకున్న
టీడీపీ శ్రేణులు
మాజీ ఎమ్మెల్యే గంగుల
బిజేంద్రారెడ్డిపై ఆంక్షలు
ఖాకీల తీరుపై నిప్పులు చెరిగిన గంగుల


