● మాజీ మంత్రి బుగ్గనరాజేంద్రనాథ్‌రెడ్డి ధ్వజం
డోన్: టీడీపీ మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థి కోట్ల సుజాతమ్మ డోన్ పట్టణ ప్రజలకు సేవ చేసేందుకు కాదని దోచుకునేందుకు పోటీ చేస్తుందని ఆర్థిక శాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన తన స్వగృహంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. మునిసిపల్ ఎన్నికల ప్రక్రియను కోట్ల సుజాతమ్మ హింసాత్మకంగా మార్చారన్నారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల్లో ముగ్గురిని నామినేషన్లు వేయకుండా భయబ్రాంతులకు గురి చేశారన్నారు. బలహీనవర్గాలకు చెందిన ఒక యువతిని తమ పార్టీ అభ్యర్థిగా నిర్ణయించి నామినేషన్ వేయిస్తే 5 గంటల పాటు పరిశీలన చేయకుండా అధికారులను భయాందోళనలకు గురి చేసింది టీడీపీ చైర్‌పర్సన్ అభ్యర్థి కాదా అని నిలదీశారు. డోన్ మున్సిపాలిటీ ఖజానాను దోచేసేందుకు ఆమె ఎన్నికల బరిలో దిగారన్నారు. ల్యాండ్, శ్యాండ్, మైన్స్, వైన్స్ నుంచి ఆక్రమంగా వసూలవుతున్న సొమ్ము ఎవరి ఖాతాలో జమవుతుందో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. అలాగే స్థానికంగా ఇంటిని నిర్మించుకునేందుకు రూ.5 కోట్ల విలువైన స్థలం ఎవరితో కొనుగోలు చేశారో చెప్పాలన్నారు. ప్రజా సేవ చేసేందుకు ఒకే ఇంటికి రెండు పదవులు అవసరం లేదన్నారు.
భయాందోళనలో పట్టణ ప్రజలు
అధికారాన్ని అడ్డు పెట్టుకొని టీడీపీ నాయకులు సాగిస్తున్న దౌర్జన్యకాండ పట్ల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని బుగ్గన అన్నారు. ధనం, పదవుల కోసం పాకులాడే సుజాతమ్మను ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని పట్టణ ప్రజలను కోరారు. తనకు తాను ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి ఏనుగుతో పోల్చుకొని వైఎస్సార్‌సీపీ నాయకులను కుక్కలతో పోల్చడం ఆయన విజ్ఞతకే వదిలేస్తుమన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రేగటి రాజశేఖర్‌రెడ్డి, మార్కెట్ మాజీ చైర్మన్ మల్లెంపల్లె రామచంద్రుడు, పార్టీ మండల అధ్యక్షుడు సోమేష్ యాదవ్, సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు తిరునాంపల్లె తిరుమల్‌రెడ్డి పాల్గొన్నారు.


