● వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగం
వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి
నందికొట్కూరు: హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన టీడీపీ నేతలకు స్థానిక ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకుందని వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని ఏబీఎం పాలెం చెందిన టీడీపీ నాయకులు నాగ సురేష్, వైవీ రమణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి బైరెడ్డి సిద్ధార్థ్థరెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ దారా సుధీర్ వైఎస్సార్సీపీ కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సిద్ధార్థరెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో సీఎం చంద్రబాబు చేతులు ఎత్తేయడం దుర్మార్గమన్నారు. టీడీపీ ప్రభుత్వంపై రోజు రోజుకు ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందన్నారు. టీడీపీ వైఫల్యాలే వైఎస్సార్సీపీకి శ్రీరామ రక్షగా నిలుస్తోందని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్న టీడీపీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని, వైఎస్సార్సీపీ ప్రతిపక్షంలో ఉన్నా బరిలో దిగేందుకు ఎంతో మంది ముందుకొస్తున్నారని తెలిపారు. టీడీపీ మోసాలను క్షేత్రస్థాయిలో ప్రజలతో వివరించాలని పార్టీ నేతలకు సూచించారు.
స్థానిక ఎన్నికలలో వైఎస్సార్సీపీని భారీ మెజార్టీతో విజయం సాధించేందుకు ప్రతి కార్యకర్త సిద్ధమవ్వాలని వైఎస్సార్సీపీ నందికొట్కూరు నియోజకవర్గ ఇన్చార్జ్ దారా సుధీర్ అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. ఎన్నికల ముందు అన్ని సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రజలను నట్టేట ముంచేశారని విమర్శించారు.


