దొర్నిపాడు: మండలకేంద్రం దొర్నిపాడు లో శనివారం గురు వంశీ అనే 8 ఏళ్ల బాలుడిపై కుక్కలు దాడి చేయడంతో తీ వ్రంగా గాయపడ్డా డు. ఇంటి వద్ద నుంచి ఆడుకునేందుకు అంకాలమ్మ ఆలయం సమీపంలోకి రాగానే మూడు కుక్కలు చుట్టుముట్టాయి. బాలుడు కేకలు వేయడంతో రెండు కుక్కలు పారిపోగా మరో కుక్క చెంప, గడ్డం కింద కరిచింది. దీంతో తీవ్రంగా గాయపడటంతో తల్లిదండ్రులు ఆళ్లగడ్డ ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం నంద్యాలకు తరలించారు. ప్రస్తుతం బాలుడు కోలుకుంటున్నట్లు తల్లిదండ్రులు చెప్పారు.
విద్యుదాఘాతంతో
రైతు మృతి
దేవనకొండ: లక్కందిన్నె గ్రామానికి చెందిన కురువ భీమన్న (42) శనివారం తన పొలంలో వరిమడికి నీరు పెట్టడానికి వెళ్లి విద్యుదాఘాతంతో మృతిచెందాడు. పొలానికి నీరు పెట్టేందుకు మోటార్ స్టార్ట్ చేయడానికి వెళ్లగా అప్పటికే స్టాటర్‌కు విద్యుత్ సరఫరా కావడంతో విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
బస్టాండ్ పరిసరాలను
పరిశుభ్రంగా ఉంచాలి
ఆళ్లగడ్డ : బస్టాండు పరిసర ప్రాంతాలు, మరుగుదొడ్లను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాల ని ఏపీఎస్‌ఆర్‌టీసీ మేనేజింగ్ డైరెక్టర్ శివప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఆళ్లగడ్డ ఆర్టీసీ బస్టాండ్‌ను శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన సేవలు అందించాలన్నారు. గ్యారేజీలో అవసరమైన మరమ్మతులు త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. టైర్ల జీవితకాలాన్ని పెంచేలా జాగ్రత్తలు తీసుకోవాలని, బస్సుల నిర్వహణ బాగుండాలని సూచించారు. డిపో ఆదాయం పెంచేందుకు సిబ్బంది కృషి చేయాలన్నారు. తనిఖీల్లో నంద్యాల జిల్లా రవాణా అధికారి రజియాసుల్తానా ఉన్నారు.
మహానంది: మహానంది మండలం బొల్లవరం గ్రామంలో శనివారం భారీ కొండచిలువ కలకలం రేపింది. గ్రామంలో కొండచిలువ కనిపించడంతో భయాందోళనకు గురైన గ్రామస్తులు అటవీశాఖ రేంజ్ ఆఫీసర్ ఉదయ్‌దీప్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన సిబ్బందిని గ్రామానికి పంపగా వారు చాకచక్యంగా కొండచిలువను పట్టుకుని సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో వదిలేశారు.


