● చంద్రబాబు తొత్తుగా ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తోంది ● జగనన్నను మూడు పార్టీలు ఎదుర్కొనలేకే అరాచకాలు, దౌర్జన్యాలు ● వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బీవై రామయ్య వెల్లడి
కర్నూలు (టౌన్): ‘టీడీపీకి ప్రజలు ఓట్లు వేయరని చంద్రబాబుకు ఇప్పటికే అర్థమైంది. అందుకే బిహార్ రాష్ట్రాన్ని తలపించేలా స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు పోటీ చేయకుండా దౌర్జన్యాలు, దాడులు చేయిస్తున్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరు’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బీవై రామయ్య స్పష్టం చేశారు. శనివారం సాయంత్రం స్థానిక ఎస్వీ కాంప్లెక్స్‌లోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడు తూ చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చి వాటన్నింటినీ చెత్త బుట్టలో పడేశారన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే కూటమికి ఓటమి తప్పదని తెలుసుకున్న చంద్రబాబు రెండు రోజులుగా రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చారన్నారు. నామినేషన్లు వేసేందుకు వెళ్తున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై టీడీపీ గూండా లు దాడులు చేస్తున్నారన్నారు. మహిళలపై సైతం దౌర్జన్యాలకు పాల్పడటం సిగ్గు చేటన్నారు. ఇంత కన్నా దుర్మార్గమైన పాలన ఎక్కడైనా ఉందా.. అని ప్రశ్నించారు. చంద్రబాబు తొత్తుగా ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తుందని ఆయన విమర్శించారు. ఇప్పటికే పలుమార్లు వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర నాయకులు ఎన్నికల కమిషనర్‌ను కలిసి వీడియో లు, ఫొటోలు ఆధారాలతో సహా అందజేశారన్నారు. అయితే ఇప్పటి వరకు ఒక్క కేసు సైతం నమోదు కాలేదన్నారు. రాష్ట్రంలో యథేచ్ఛగా ఎన్నికల ఉల్లంఘనలు జరుగుతున్నా ఎన్నికల కమిషన్ స్పందించకపోవడం వెనుక అనుమానాలు వ్యక్తవుతున్నాయన్నారు.
జీవో తెచ్చుకుని ఏకగ్రీవంగా ప్రకటించుకోండి..
ఓటమి తప్పదని తెలుసుకున్న సీఎం చంద్ర బాబు నాయుడు ప్రత్యేకంగా జీవోలు తెచ్చుకొని మేయర్లు, చైర్మన్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించుకోండి అని ఎద్దేవా చేశారు. డీఎస్సీలో కావాల్సిన వారికి ఉద్యోగాలు ఇచ్చేందుకు జీవోలను మార్చలేదా అని గుర్తు చేశారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అదే చేస్తే సరిపోతుంది కదా విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తున్న ఆగడాలు, దౌర్జన్యాలను ప్రజలు గమనిస్తున్నారని, పోలింగ్ రోజు ఈ ప్రభుత్వానికి దిమ్మదిరిగే విధంగా సమాధానం చెబుతారన్నారు. మూడు పార్టీలు కాదు.. 30 పార్టీలు వచ్చినా వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ విజయం తథ్యమన్నారు.


