ఎంపీఈఓలపై ఇంత నిర్లక్ష్యమేలా!
కర్నూలు(అగ్రికల్చర్): వ్యవసాయ శాఖలో పనిచేస్తున్న ఎంపీఈఓలు పరి స్థితి దయనీయంగా మారింది. కర్నూలు జిల్లాలో 200, నంద్యాల జిల్లాలో 160 ప్రకారం ఉమ్మడి కర్నూలు జిల్లాలో 360 మంది ఎంపీఈఓలు పనిచేస్తున్నారు. వీరికి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు మాత్రమే వేతనాలు అందాయి. మార్చి నుంచి 8 నెలలుగా వేతనాలు అందకపోవడంతో వారి జీవనం అస్తవ్యస్తమైంది. అప్పులు చేసి జీవనం సాగిస్తున్నారు. ఎంపీఈఓలను కొనసాగిస్తూ ప్రతి ఏటా జీవో ఇవ్వాల్సి ఉంది. కొనసాగింపు జీవో రెండు నెలల కిత్రమే వచ్చినప్పటికీ వేతనాల చెల్లింపులో నెలకొన్న నిర్లక్ష్యం వందలాది మంది ఎంపీఈఓలను పండుగకు దూరం చేస్తోంది. సాధారణంగా ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే ఈ జీవో ఇవ్వాల్సి ఉంది. చంద్రబాబు సర్కార్ మాత్రం 10 నెలలు ఆలస్యంగా జీవో ఇవ్వడం గమనార్హం. ఉద్యోగ భద్రత, నెల నెల వేతనాల చెల్లింపు తదితర డిమాండ్‌లతో జూలై నెలలో ఎంపీఈఓలు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఆందోళన ఫలితంగా కొనసాగింపు జీవో వచ్చింది. వేతనాల చెల్లింపునకు నిధి పోర్టల్‌లో ఎంపీఈఓల వివరాలు నమోదు చేసే విధంగా ఆదేశాలు వచ్చాయి. కాని పండుగ పూట కూడా జీతాలు లేని దుస్థితిని ఎంపీఈఓలు ఎదుర్కొంటున్నారు. 8 నెలలుగా వేతనాలు లేకపోతే పండుగ ఎలా జరుపుకోవాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 12 ఏళ్లుగా వ్యవసాయ శాఖలో పనిచేస్తున్న వారు ప్రారంభంలో ఇచ్చిన రూ.12 వేలే నేటికి కొనసాగుతోంది. సమాన పనికి సమాన వేతనం ఉండాలని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు వీరికి వర్తించడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డెక్కి ఆందోళనలు చేపడుతున్నప్పటికీ సర్కార్‌కు చీమ కుట్టినట్లుగా కూడా లేదు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల పండుగపూట కూడా పచ్చడి మెతుకులే తప్పడం లేదని ఎంపీఈఓలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


