● కూష్మాండదుర్గగా భ్రామరి
● కై లాసవాహనంపై ఆది దంపతులు
● భక్తులతో పోటెత్తిన శ్రీశైలం
శ్రీశైలంటెంపుల్: ఇల కై లాసమైన శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు దేదీప్యమానంగా జరుగుతున్నాయి. కూష్మాండదుర్గ రూపంలో శ్రీభ్రమరాంబాదేవి బుధవారం భక్తులకు దర్శనమిచ్చారు. కై లాస వాహనంపై నుంచి స్వామిఅమ్మవార్లు భక్తులను దీవించారు. కూష్మాండదుర్గ అమ్మవారు సృష్టికి ఆది స్వరూపిణి అని, ఎనిమిది భుజాలు కలిగి ఉంటారని పండితులు తెలిపారు. కూష్మాండదుర్గ దేవిని ఆరాధిస్తే ఆయువు, యశస్సు వృద్ధి చెందుతాయని భక్తుల నమ్మకం. అమ్మవారి ఉత్సవమూర్తిని కూష్మాండదుర్గ రూపంలో అలంకరించి ఆలయం ఎదుట ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికలో అధిష్టింపజేశారు. అర్చకులు, పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.
కనులపండువగా గ్రామోత్సవం
కై లాస వాహనాధీశులైన స్వామిఅమ్మవార్లను అలంకార మండపంలోకి అధిష్టింపజేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఉత్సవం నిర్వహించి గ్రామోత్సవానికి తరలించారు. ఆలయ రాజగోపురం, గంగాధర మండపం, నందిమండపం, బయలు వీరభద్రస్వామి ఆలయం వరకు గ్రామోత్సవం కనులపండువగా సాగింది. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. స్వామిఅమ్మవార్లను భక్తులు కనులారా దర్శించుకుని ప్రత్యేక నీరాజనాలు సమర్పించారు. పూజా కార్యక్రమంలో దేవస్థాన ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పోతుగుంట రమేష్‌నాయుడు, ఈఓ శ్రీనివాసరావు, అధికారులు పాల్గొన్నారు.
శ్రీశైలంలో నేడు..
దసరా మహోత్సవాల్లో భాగంగా శ్రీశైల మహాక్షేత్రంలో గురువారం శ్రీశైల భ్రమరాంబాదేవి స్కంధమాత అలంకారంలో దర్శనమివ్వనున్నారు. స్వామిఅమ్మవార్లు శేషవాహనంపై భక్తులను దీవించనున్నారు.


