ఈవీఎంలకు పటిష్ట భద్రత | - | Sakshi
Sakshi News home page

ఈవీఎంలకు పటిష్ట భద్రత

Oct 15 2026 11:47 AM | Updated on Oct 15 2026 11:47 AM

● జిల్లా కలెక్టర్‌ రాజకుమారి

నంద్యాల(అర్బన్‌): ఎలాంటి నిర్లక్ష్యాన్ని తావులేకుండా ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలకు పటిష్ట భద్రత కల్పించాలని అధికారులను జిల్లా కలెక్టర్‌ రాజకుమారి ఆదేశించారు. టెక్కె మార్కెట్‌ యార్డ్‌లో ఈవీఎం గోదాములను బుధవారం పరిశీలించారు. గోదాముల తాళాలు, సీళ్ల పటిష్టత, సీసీటీవీ కెమెరాల పనితీరును తనిఖీ చేశారు. పోలీసుల లాగ్‌బుక్‌ను పరిశీలించి విధుల నిర్వహణ వివరాలుతెలుసుకున్నారు. సీసీటీవీ కెమెరాలు నిరంతరం పనిచేసేలా చూడాలని ఆదేశించారు. అగ్నిమాపక పరికరాలను సిద్ధంగా ఉంచాలని సూచించారు.భద్రతా ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తూ లోపాలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సబ్‌ కలెక్టర్‌ మనీషా, జిల్లా రెవెన్యూ అధికారి రామునాయక్‌, తహసీల్దార్‌ సత్య శ్రీనివాసులు, ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్‌ మనోహర్‌ తదితరులు పాల్గొన్నారు.

శ్రీశైలం డ్యాంలో

65 టీఎంసీల నీరు

శ్రీశైలంప్రాజెక్ట్‌: శ్రీశైలం జలాశయంలో బుధవారం సాయంత్రం సమయానికి 65.7316 టీఎంసీల నీరు నిల్వగా ఉంది. డ్యాం నీటిమట్టం 842.50 అడుగులకు చేరుకుంది. శ్రీశైలం జలాశయం నుంచి దిగువ ప్రాజెక్ట్‌లకు 16,572 క్యూసెక్కుల నీరు మంగళవారం నుంచి బుధవారం వరకు విడుదలయ్యింది. బ్యాక్‌వాటర్‌ నుంచి హంద్రీ–నీవా సుజలస్రవంతికి 1,694 క్యూసెక్కులు, తెలంగాణాలోని కల్వకుర్తి ఎత్తిపోతలకు 2,400 క్యూసెక్కులు వదులుతున్నారు. ఎడమగట్టు జలవిద్యుత్‌ కేంద్రంలో 5.550 మిలియన్‌ యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసి నాగార్జునసాగర్‌కు 12,323 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.

జెడ్పీ సీఈఓగా శివశంకర్‌

నంద్యాల(అర్బన్‌): జెడ్పీ సీఈఓగా శివశంకర్‌ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జెడ్పీ సీఈఓగా షర్మిలాదేవిని నియమించినా విధుల్లో చేరలేదు. ఈ క్రమంలో కర్నూలు జిల్లా పత్తికొండలో డీడీఏగా విధులు నిర్వహిస్తున్న శివశంకర్‌ను జెడ్పీ సీఈఓగా నియమించారు. బుధవారం ఆయన జెడ్పీ సీఈఓగా బాధ్యతలు తీసుకున్నారు. స్థానిక ఎంపీడీఓ సుగుణశ్రీ, కార్యాలయ సిబ్బంది అభినందనలు తెలిపారు.

గిరిజన మహిళలకు ‘ఉన్నతి’ రుణాలు

శ్రీశైలంప్రాజెక్ట్‌: చెంచు గిరిజన మహిళల జీవనోపాధి మెరుగుపరిచేందుకు ఉన్నతి, ట్రైకార్‌, బ్యాంక్‌ లింకేజీల కింద రుణాలు మంజూరు చేయించాలని ఐటీడీఏ ప్రాజెక్ట్‌ అధికారి పీవీఎస్‌ నాయుడు అన్నారు. ఐటీడీఎ కార్యాలయంలో మార్కాపురం, నంద్యాల, పల్నాడు జిల్లాల వెలుగు ఏపీఎం, సీసీలతో సమావేశం నిర్వహించారు. ఇప్పటికే ఏర్పాటైన నన్నారి, మిర్చి పౌడర్‌, జూట్‌ బ్యాగ్‌, ఇటుకలు, విస్తరాకుల తయారీ యూనిట్లను అభివృద్ధిలోకి తీసుకురావాలన్నారు. యూనిట్ల ద్వారా ఆదాయం పెంచాలని, వారికి మార్కెటింగ్‌పై అవగాహన కల్పించాలన్నారు. ప్రతి ఒక్కరికీ ఆధార్‌, రేషన్‌ కార్డు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామైక్య సంఘాలు జరిపే ప్రతి సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొనేటట్లు చూడాలన్నారు.

క్వింటా ఉల్లి రూ.4,151

కర్నూలు(అగ్రికల్చర్‌): కర్నూలు వ్యవసాయ మార్కెట్‌ యార్డుకు బుధవారం 3,658 క్వింటాళ్ల ఉల్లిగడ్డలు విక్రయానికి వచ్చాయి. కనిష్ట ధర రూ.629, గరిష్ట ధర రూ.4,151 లభించగా.. సగటు ధర రూ.3,569 నమోదైంది. వేరుశనగ ధర భారీగా తగ్గింది. ఇటీవలి వరకు గరిష్టంగా రూ.9వేల వరకు ధర లభించింది. తాజా కనిష్ట ధర రూ.3,777 లభించగా.. గరిష్ట ధర రూ.7,819, సగటు ధర రూ.7589 పలికింది. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో మొక్కజొన్న పూర్తిగా దెబ్బతినింది. మార్కెట్‌కు కేవలం 38 క్వింటాళ్లు రాగా.. కనిష్ట ధర రూ.1,860.. గరిష్ట ధర రూ.2547 నమోదైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement