● వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి
నందికొట్కూరు: తెలుగుదేశం పార్టీకి కౌంట్‌డౌన్ ప్రారంభమైందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందన్నారు. నందికొట్కూరు పట్టణం మారుతినగర్ కాలనీకి చెందిన టీడీపీ నాయకుడు, గౌరు వెంకటరెడ్డి అనుచరుడు మాబాషా తన అనుచరులతో కలిసి బుధవారం వైఎస్సార్‌సీపీలో చేరారు. వీరికి బైరెడ్డి సిద్ధార్థరెడ్డి కండువా కప్పి వైఎస్సార్‌సీపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బైరెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ అని టీడీపీ నేతలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక మరచిపోయారన్నారు. నిరు ద్యోగభృతి, ఆడబిడ్డ పథకం ఊసే లేదన్నారు. పంటలు పండక రైతులు తీవ్రంగా నష్టపోయినా కనీసం పరిహారం కూడా ఇవ్వలేని దుస్థితి నెలకొందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి గుణపాఠం చెప్పాలన్నారు. మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. బైరెడ్డి సిద్ధార్థరెడ్డి వెంట వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు మన్సూర్, నాయకులు శివరామకృష్ణారెడ్డి, ప్రదీప్, భార్గవ్ తేజ తదితరులు ఉన్నారు.


