నిష్ఠతో కట్టుబాట్లను పాటిస్తారు
వారు మద్యం ముట్టరు..మాంసం తినరు. చెప్పులు అసలే తొడగరు. కటిక నేలపైనే పడుకుంటారు. ఒకరు కాదు ఇద్దరు కాదు మూడు గ్రామాల ప్రజలు మాళ మల్లేశ్వరుడిపై అమిత భక్తితో అన్ని సుఖాలు త్యజించి 12 రోజుల పాటు అత్యంత నిష్టతో ఈ కట్టుబాట్లను పాటిస్తారు. హొళగుంద మండలం నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామాల్లో దేవరగట్టు బన్ని ఉత్సవాల్లో భాగంగా అనాదిగా వస్తున్న సంప్రదాయమిది.
● దేవరగట్టు ఉత్సవాల్లో భాగంగా దీక్షను ప్రారంభించిన నెరణికి, నెరణికి తండా, కొత్తపేటవాసులు ● 12 రోజుల పాటు కటిక నేలపైనే నిద్ర, చెప్పులు తొడుక్కోకుండా కట్టుబాట్ల నిర్వహణ ● నే డు దేవరగట్టు మాళ మల్లేశ్వరస్వామి కంకణధారణ
హొళగుంద: దేవరగట్టు ఉత్సవాల్లో భాగంగా నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామాలకు చెందిన భక్తులు అమావాస్య రోజు నుంచి కొన్ని కఠిన కట్టుబాట్లు పాటిస్తారు. బన్ని ఉత్సవాలు సాఫీగా ముగిసి విగ్రహాలు తిరిగి నెరణికి గ్రామానికి చేరే వరకు నిష్టతో ఉంటారు. 12 రోజుల పాటు చెప్పులు తొడుక్కోరు. దాంపత్య సుఖానికి పూర్తిగా దూరంగా ఉంటారు. మద్యం జోలికెళ్లరు. మాంసం ముట్టరు. ఈ కట్టుబాట్లను పాటిస్తున్నందునే వేలాది కర్రల మధ్య సాగే బన్ని(కర్రల సమరం)లో జైత్రయాత్ర విజయ వంతంగా ముగించి విగ్రహాలను నెరణికి గ్రామానికి చేరుస్తున్నామని ఆ మూడు గ్రామాల ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా విగ్రహాలు నెరణికి గ్రామానికి చేరే రోజు విజయానికి సూచికగా వారు విజయ దశమి పండుగ చేసుకుంటారు. ఈ కట్టుబాట్లను కులమత భేదాలు లేకుండా అన్ని వర్గాల వారు పాటిస్తూ బన్ని ఉత్సవంలో భాగస్వాములవ్వడం విశేషం.
నేడు గట్టుపై కంకణ ధారణ
నెరణికి గ్రామం నుంచి ఈ నెల 15న (నేడు) దేవరగట్టుకు చేరుకున్న మాళ మల్లేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలకు రాత్రి ఆలయంలోని కంకణ కట్టపై ప్రత్యేక పూజలు చేస్తారు. నెరణికి, నెరణికి తండా, కొత్తపేట భక్తుల జయజయ ధ్వనుల మధ్య పురోహితులు మాత మాళమ్మ, మల్లేశ్వరునికి కంకణ ధారణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహిస్తారు.
బన్ని ఉత్సవాలు జరుగుతాయి ఇలా..
● ఈ నెల 21న బుధవారం విజయదశమి రోజున
కల్యాణోత్సవం, బన్ని, జైత్రయాత్ర
● 22న భవిష్యవాణి (దైవవాణి)
● 23న సాయంత్రం స్వామివారి రథోత్సవం
● 24న గొరవయ్యల ఆటలు, గొలుసు తెంపుట,
● 25న మాళమల్లేశ్వర స్వామి విగ్రహాలు
నెరణికి గ్రామానికి చేరగానే ఉత్సవాలు
ముగిసినట్లు ప్రకటిస్తారు.
దేవరగట్టు ఉత్సవాల్లో మూడు గ్రామాల ప్రజలు నిష్ఠతో కట్టుబాట్లు పాటిస్తారు. ఇక బన్ని రోజు రెండుసార్లు స్నానం చేస్తారు. సాయంత్రం గట్టుకెళ్లే ముందు ప్రతి ఒక్కరు స్నానమాచారించి అన్ని గుడిలకు వెళ్లి టెంకాయలు కొడుతారు. అనంతరం తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుని కొండకు బయలుదేరుతారు. బన్నిలో ఏ ఒక్కరు మద్యం తాగరు, మాంసం ముట్టరు. తాగి కర్రలతో విగ్రహాల మీదకు వచ్చే వారిని తరమడమే లక్ష్యంగా జైత్రయాత్రలో పాల్గొంటారు.
రవిశాసీ్త్ర, మాళమల్లేశ్వరునికి కల్యాణం
నిర్వహించే పురోహితుడు, నెరణికి


