పింఛన్‌ రాదు.. కష్టాలు తొలగవు! | - | Sakshi
Sakshi News home page

పింఛన్‌ రాదు.. కష్టాలు తొలగవు!

Oct 15 2026 11:47 AM | Updated on Oct 15 2026 11:47 AM

● నలుగురి ఆడపిల్లలతో కష్టంగా జీవిస్తున్న మహిళ

● నలుగురి ఆడపిల్లలతో కష్టంగా జీవిస్తున్న మహిళ

ఆలూరు: సెంటు భూమి లేదు.. ఉండేందుకు ఇల్లు లేదు.. కట్టుకున్న భర్త అకాల మృత్యువాతకు గురయ్యారు. నలుగురి ఆడపిల్లలను కష్టంగా పోషిస్తున్న జంగాలి మారెమ్మ దీనగాథ ఇదీ.. ఆలూరు గ్రామానికి చెందిన మారెమ్మకు పదిహేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన జంగాలి గాదిలింగప్పతో వివాహం అయ్యింది. వీరికి రాధిక, రంగవేణి, రమ్య, మీన కుమార్తెలు ఉన్నారు. మొదటి ముగ్గురు కుమార్తెలు 11 ఏళ్ల నుంచి ఆరేళ్లలోపు ఉండటంతో స్కూల్‌కు వెళ్తున్నారు. చివరి అమ్మాయికి మూడేళ్లు మాత్రమే కావడంతో అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్తోంది. రబ్బరు బిందెలు అమ్ముతూ కుటుంబాన్ని పోషించే జంగాలి గాదిలింగప్ప అనారోగ్యంతో మూడేళ్ల క్రితం మృతిచెందాడు. అప్పటి నుంచి మారెమ్మకు కష్టాలు మొదలయ్యాయి.

అందని పింఛన్‌!

ఆలూరులో మారెమ్మకు సొంత ఇల్లు లేదు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు కొట్టంలో ఉండేందుకు వీలు కల్పించారు. ఆలూరు పట్టణంలో కాకుండా వివిధ గ్రామాలలోకి వెళ్లి ప్లాస్టిక్‌ సామగ్రిని విక్రయిస్తూ వచ్చిన డబ్బులతో కుమార్తెలను పోషిస్తున్నారు. పెద్ద అమ్మాయికి అరోగ్యం సరిగ్గా లేకపోవడంతో ప్రస్తుతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఈ కుటుంబానికి వితంతువు పింఛన్‌ ఇవ్వలేదు. అన్ని రకాలుగా అర్హత ఉన్నా మారెమ్మకు అధికారులు కనీసం కుల ధ్రువీకరణ (ఎస్సీ) సర్టిఫికెట్‌ ఇవ్వలేదు. దీంతో ఆమె పింఛన్‌కు ఓసీగా దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం అధికారులు మంజూరు చేస్తారో లేదో తెలియడంలేదు.

ఆర్థిక ఇబ్బందులు

మారెమ్మ భర్తకు జంగాలి గాదిలింగప్పకు రేషన్‌ కార్డు ఉంది. అయితే కుటుంబానికి కేవలం ఐదు కేజీల బియ్యం మాత్రమే వేస్తున్నారు. ఈ బియ్యంతో నలుగురి కుమార్తెల పోషణ భారంగా మారింది. కూలీ పనులకు వెళ్లలేక ప్లాస్టిక్‌ సామాన్లు విక్రయిస్తుండగా వచ్చే మొత్తం స్వల్పంగా ఉంటోంది. ఆర్థిక ఇబ్బందులతో ఉన్న మారెమ్మకు ప్రభుత్వం చేయూత లభించలేదు. వితంతువు పింఛన్‌ ఇచ్చి ఆదుకోవాలని మారెమ్మ కన్నీటి పర్యంతమయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement