సినీఫక్కీలో దారిదోపిడీ | - | Sakshi
Sakshi News home page

సినీఫక్కీలో దారిదోపిడీ

Oct 15 2026 11:47 AM | Updated on Oct 15 2026 11:47 AM

● బైక్‌ చేజ్‌ చేసి రూ. 7.05 లక్షల నగదు అపహరణ ● గుళ్లదూర్తి వద్ద ఘటన – విచారణ జరుపుతున్న పోలీసులు

● బైక్‌ చేజ్‌ చేసి రూ. 7.05 లక్షల నగదు అపహరణ ● గుళ్లదూర్తి వద్ద ఘటన – విచారణ జరుపుతున్న పోలీసులు

కోవెలకుంట్ల: కోవెలకుంట్ల– జమ్మలమడుగు ఆర్‌అండ్‌బీ రహదారిలో బుధవారం పట్ట పగలు సినీఫక్కీలో దారి దోపిడీ జరిగింది. స్థానికులు అందించిన సమాచారం మేరకు.. ఉయ్యాలవాడ మండలం పెద్ద యమ్మనూరుకు చెందిన సానా వెంకటరాముడు, వెంకటలక్ష్మి, నరసింహుడు పొలం రిజిస్ట్రేషన్‌ నిమిత్తం రూ. 7.05 లక్షల నగదును బ్యాగ్‌లో పెట్టుకుని ముగ్గురు ఒకే బైక్‌పై కోవెలకుంట్ల సబ్‌ రిజిస్టర్‌ ఆఫీస్‌కు బయలుదేరారు. వీరు నగదుతో వెళుతున్నారని ముందే పసిగట్టిన గుర్తు తెలియని ముగ్గురు దుండగులు మరో బైక్‌పై వారిని ఫాలో అయ్యారు. బైక్‌ నడిపే వ్యక్తి తలకు హెల్మెట్‌ పెట్టుకోగా మిగిలిన ఇద్దరు ముఖం కనిపించకుండా హ్యాండ్‌ కర్చీప్‌ కుట్టుకున్నారు. మండలంలోని గుళ్లదూర్తి సమీపంలో జాతీయ రహదారిపై నిర్మాణ దశలో ఉన్న టోల్‌గేటు వద్ద ముందుగా వెళుతున్న వ్యక్తి బైక్‌ స్పీడ్‌ను తగ్గించాడు. గమనించిన దుండగులు వెనుకవైపు నుంచి మెరుపు వేగంతో వచ్చి మహిళ చేతిలో ఉన్న బ్యాగ్‌ను అపహరించుకెళ్లారు. బ్యాగ్‌ లాక్కునే క్రమంలో వారిబైక్‌ కింద పడటంతో మహిళతో పాటు మరో వ్యక్తికి స్వల్పగాయాలయ్యాయి. నగదు బ్యాగ్‌ను చోరీచేసిన దుండగులు కోవెలకుంట్ల వైపు పరారయ్యారు. స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కోవెలకుంట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స అనంతరం బాధితులు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి చోరీ సంఘటనపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కోవెలకుంట్ల సీఐ హనుమంతునాయక్‌, ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి, సీసీఎస్‌ పోలీసులు రంగప్రవేశం చేసి వివిధ ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల ద్వారా దుండగులను గుర్తించే ప్రయత్నం చేయగా వారు నంబర్‌ప్లేట్‌ లేని బైక్‌లో వచ్చి పరారైనట్లు తెలిసింది. పక్కా ప్రణాళికతోనే దుండగులు దారిదోపిడీకి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై వారు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement