దొర్నిపాడు: గుంపుగా ఉన్న కోళ్లు ఉన్నట్టుండి పెద్దగా అరుస్తూ చెదిరిపోయాయి. అరుపులు విని ఇంట్లోని వాళ్లు బయటకు బయటకు వచ్చి చూడగా ఓ కొండచిలువ కోడిపుంజును చుట్టుకొని మింగే ప్రయత్నం చేస్తుండటాన్ని చూసి గజగజ వణికిపోయారు. ఈ ఘటన మండలంలోని క్రిష్టిపాడు గ్రామంలోని ఎస్సీ కాలనీలో భీమన్న ఇంటి వద్ద మంగళవారం చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా కోళ్ల సంఖ్య తగ్గిపోతుండటంతో పిల్లులు లేదా ముంగిసలు తిన్నాయేమోనని అనుమానించారు. అయితే మంగళవారం కొండచిలువను చూసి భయభ్రాంతులకు గురయ్యారు. ఇంటి వద్ద పశువుల కోసం వేసిన గడ్డివామిలో నివాసం ఏర్పాటు చేసుకున్న కొండచిలువ సుమారు 9 అడుగులు ఉంటుంది. కోడిపుంజును చుట్టుకొని మింగేందుకు ప్ర యత్నించగా స్థానికులు రావడంతో బెదిరి కోడిపుంజును వదిలేసి వామిలోకి చొరబడింది. పట్టుకొని కుందూనది ఒడ్డున ముళ్ల పొదల్లో వదిలేందుకు ప్రయత్నించగా చిక్కడం లేదు. దీంతో పశువులు, గొర్రెలు ఉన్న వాళ్లు భయాందోళన చెందుతున్నారు.


