వృత్తిలో కొన్ని సంఘటనలు మరపురాని అనుభవాన్ని మిగులుస్తాయి. అవి వృత్తి నైపుణ్యాన్ని పెంచడంతోపాటు తమ ఆలోచనలకు పదునుపెట్టే విధంగా రాటుదేల్చుతాయి. ఆలోచనతో ముందడుగు వేస్తే చిన్న క్లూ చాలు ఎంతటి చోర శిఖామణి అయినా పట్టుబడిపోతాడు. ప్రస్తుతం శ్రీశైలం సీఐగా ఉన్న జీవన్ గంగానాథ్‌బాబు 2010లో ఎస్‌ఐగా ఉన్నప్పుడు ఎదురైన అనుభవాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు.
● 10 తులాల బంగారం చోరీ చేసిన ఆగంతకుడు ● పోలీసు స్టైల్‌లో విచారిస్తే బయటపడ్డ మరో పది దొంగతనాలు ● 24 గంటల్లో కేసును చేధించిన వైనం ● శ్రీశైలం సీఐ జీవన్ గంగనాథ్‌బాబు కెరీర్‌లో మర్చిపోలేని ఘటన
శ్రీశైలం: 2010లో నందికొట్కూర్‌లో ఎస్‌ఐగా పనిచేసేటప్పుడు పది తులాల బంగారు నగలు చోరీకి గురైనట్లు కేసు నమోదైంది. ఆ ఇంటిని పరిశీలించి చోరీ జరిగిన విధానాన్ని బట్టి దొంగతనం చేసిన వ్యక్తి ఎటు వెళ్లి ఉంటాడో అని విచారణ చేపట్టారు. దొంగ ఇంట్లోకి ప్రవేశించి దొంగతనం చేసి ఎలా బయటికి వెళ్లి ఉంటాడో ఒక అంచనాకు వచ్చారు.
సీన్ ఆఫ్ క్రైంలో కీలక ఆధారం
నందికొట్కూరులో తాళం వేసిన ఇంటిని గమనించి రెక్కీ నిర్వహించాక రాత్రి సమయంలో దొంగ ఇంట్లోకి ప్రవేశించాడు.ఇంట్లో దొరికిన 10 తులాల బంగారాన్ని మూటగట్టుకొని అక్కడి నుంచి బయటపడ్డాడు. దొంగతనం చేయడానికి వచ్చిన దారి గాకుండా బయటపడేందుకు కొత్త దారి వెతుక్కున్నాడు. కేసు విచారణలో ఇదే కీలకంగా మారింది. దొంగ ఆ ఇంటికి వచ్చిన మార్గం, బయటికి వెళ్లే మార్గంపై పోలీసులు దృష్టి సారించారు. ఇంటి మేడ పైనుంచి ఆ వెనకనే ఉన్న మరొక మేడ మీదకి ఎక్కి ఆ తర్వాత పక్క నుంచి రెండో వీధిలో ఉన్న మేడ పైనుంచి బయటపడినట్లు నిర్ధారణకు వచ్చారు. రెండో వీధిలో 100 అడుగుల దూరం వరకు కు్‌్ షణ్ణంగా పరిశీలించగా బస్ టికె ట్ ముక్క దొరికింది. ఆ టికెట్‌పై అవుకు – బనగానపల్లె ప్రయాణించినట్లు ఉంది. దాని ఆధారంగా విచారణ చేపట్టారు. టికెట్ ఇచ్చిన బస్ కండక్టర్‌ను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి తమ వద్ద ఉన్న పాత నేరస్తుల ఫొటోలను అతనికి చూపించారు. అందులో ఒక వ్యక్తిని గుర్తుపట్టి అతడు అవుకు – బనగానపల్లి రూట్‌లోని ఒక పల్లెలో బస్సు ఎక్కి బనగానపల్లెలో దిగినట్లు చెప్పాడు.
పట్టుబడింది ఇలా..
ఆ మార్గంలోని పల్లెలో విచారణ చేయగా నిందితుడు ఆళ్లగడ్డలో భార్యతో కలిసి లాడ్జిలో ఉన్నట్లు సమాచారం అందింది. వెంటనే పోలీసులు సిబ్బందితో వెళ్లి నిందితుడిని అదుపులోకి తీసుకొని నందికొట్కూరు స్టేషన్‌కు తరలించారు. అక్కడ తమదైన శైలిలో విచారణ చేయగా నేరం ఒప్పుకున్నాడు. చోరీ చేసిన బంగారం ఇంట్లో ఉందని చెప్పడంతో నిందితుడిని వెంటబెట్టుకొని తీసుకొచ్చేందుకు వెళ్లారు.
పొగ గొట్టం గుండా పరారీ
బనగానపల్లెలోని నిందితుడి ఇంటికి చేరుకున్నారు. పోలీసులు రెండడుగులు వెనక ఉండగా నిందితుడు గబుక్కున లోపలకి వెళ్లి తలుపు వేసి గడియ పెట్టుకున్నాడు. ఈ హఠాత్పరినామాన్ని పోలీసులు ఊహించలేదు.కొద్దిసేపటికి నిందితుడి తల్లి తలుపు తీసింది. అయితే దొంగ కనిపించలేదు. అతని చొక్కా మాత్రం కనిపించింది. ఎలా తప్పించుకుపోయాడో కాసేపు అర్థం కాలేదు. దొంగ తన చొక్కా విప్పి పొగ గొట్టం లోనుంచి పైకి వెళ్లి అట్నుంచి సమీపంలో ఉన్న పొలాల్లోకి పరిగెత్తినట్లు నిర్ధారించుకున్నారు. మఫ్టీలో ఉన్న పోలీసులు పొలాల వైపు వెళ్లి వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో మరో పొ లం నుంచి ఎదురు వస్తున్న నిందితుడు వారిని గమనించి పరుగుపెట్టాడు. పోలీసులు వెంబడించి ఎలాగోలా పట్టుకొని నందికొట్కూర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి పూర్తిస్థాయిలో విచారణ చేయగా మరో 10 దొంగతనాల వ్యవహారం బయటపడింది. 24 గంటల్లో నిందితుడిని పట్టుకొని అతని వద్ద నుంచి బంగారం రికవరీ చేయడంతో పాటు మరో 10 కేసుల్లో కూడా దోచుకున్న బంగారం మూటను అతని ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఇది తన కెరీర్‌లో మర్చిపోలేని సంఘటనగా సీఐ జీవన్ గంగనాథ్‌బాబు తెలిపారు.


