మహానంది: ధైర్యం, చైతన్యానికి ప్రతీకగా అమ్మవారి నుదుటిపై గంట ఆకారంలో చంద్రుడు ఉండటం వల్ల శ్రీ చంద్రఘంట దుర్గ అనే పేరు వచ్చిందని మహానంది ఆలయ వేద పండితులు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర అవధాని తెలిపారు. మహానంది క్షేత్రంలో శ్రీ కామేశ్వరీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మూడోరోజైన మంగళవారం మూలమూర్తి శ్రీ కామేశ్వరీదేవి అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో అలంకార సేవ పూజలు ఘనంగా నిర్వహించారు. కళ్యాణ మండపంలో సహస్ర దీపాలంకరణ అనంతరం రాత్రి ఉత్సవమూర్తి కామేశ్వరీదేవి చంద్రఘంట దుర్గ అలంకారంలో సింహవాహనంపై కొలువై భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం నుంచి రాత్రి వరకు జరిగిన పూజల్లో ఉభయదాతలు పాల్గొనగా వేదపండితులు, అర్చకులు వారి చేత శత చండీయాగాలు, చండీ హోమాలు, నవవరణార్చన, సామూహిక కుంకుమార్చన పూజలు నిర్వహింపచేసి స్వామి, అమ్మవారి తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. రాత్రి అమ్మవారి ఆలయ మాడవీధుల్లో జరిగిన ఉత్సవాన్ని వేలాది మంది భక్తులు తిలకించారు.


