ఆగని వలస బండి | - | Sakshi
Sakshi News home page

ఆగని వలస బండి

Oct 13 2026 1:35 AM | Updated on Oct 13 2026 1:35 AM

గోనెగండ్ల: పశ్చిమ ప్రాంతం నుంచి వలసలు ఆగడం లేదు. తీవ్ర కరువు ప్రభావంతో స్థానికంగా వ్యవసాయ పనులు, ఉపాధి పనులు లేకపోవడంతో రైతులు, కూలీలు పిల్లాపాపలతో కలిసి ఇతర ప్రాంతాలకు వలసపోతున్నారు. సోమవారం మండల పరిధిలోని గోనెగండ్ల, గంజహళ్లి తదితర గ్రామాల నుంచి దాదాపు 50కు పైగా కుటుంబాలు బతుకుదెరువు కోసం తెలంగాణలోని నల్గొండ, అలంపూర్‌ తదితర ప్రాంతాలకు పయనమయ్యారు. అక్కడ పత్తి పనులు చేసుకొని కుటుంబాన్ని పోషించుకుంటామని కూలీలు తెలిపారు.

జాతీయ స్థాయి మాస్టర్‌ అథ్లెటిక్‌ పోటీలకు ఎంపిక

సంజామల: స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు బాషా జాతీయ స్థాయి మాస్టర్‌ అథ్లెటిక్‌ పోటీలకు ఎంపికయ్యారు. ఈనెల 10,11 వతేదీన గుంటూరు నాగార్జున యూరివర్సిటీలో రాష్ట్ర స్థాయి మాస్టర్‌ అథ్లెటిక్‌ 40 ఫ్లస్‌ విభాగంలోని క్రీడలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచాడు. జావెలిన్‌ త్రో, హైజంప్‌లో బంగారు పతకాలు, షాట్‌ పుట్‌లో రజత పతకాన్ని సాధించి జాతీయ స్థాయికి ఎంపికై నట్లు ఎంఈఓ రమణారెడ్డి సోమవారం తెలిపారు.

అన్నను చంపిన తమ్ముడు అరెస్టు

గడివేముల: అన్నను దారుణంగా హత్య చేసిన తమ్ముడిని పోలీసులు అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. మండల పరిధిలోని బిలకలగూడూరు గ్రామంలో చోటుచేసుకున్న ఈ కేసుకు సంబంధించిన వివరాలను పాణ్యం సీఐ కిరణ్‌కుమార్‌రెడ్డి..ఎస్‌ఐ నాగార్జునరెడ్డితో కలిసి వెల్లడించారు. చెంచు తోట సుంకన్న గతంలో చోరీలకు పాల్పడేవాడు. దీంతో అతని మీద కేసులు నమోదవ్వగా పోలీసులకు దొరకకుండా స్వగ్రామం బిలకలగూడూరు నుంచి ఆళ్లగడ్డ మండలం బాచేపల్లికి వెళ్లి అక్కడ నివసించేవాడు. పోలీసులు తరచుగా సుంకన్న తమ్ముడైన గోలుసన్న ఇంటి వద్దకు వచ్చి ఆరా తీసేవారు. విసిగిన గోలుసన్న ఈనెల 10వ తేది సాయంత్రం సుంకన్నను ఊరికి పిలిపించి నిలదీశాడు. ఇరువురి మధ్య మాటామాట పెరిగి గొడవ జరిగింది. అలాగే సుంకన్న తన మొదటి భార్యను వదలిపెట్టగా గొలుసన్న పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయంలో కూడా ఇరువురి మధ్య మనస్పర్థలు ఉన్నాయి. ఈ అన్నింటిని మనుస్సులో పెట్టుకున్న తమ్ముడు తన అన్నను అదే రోజు రాత్రి ఇంటి వద్ద కొడవలితో గొంతు నరికి హత్య చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బూజునూరు క్రాస్‌రోడ్డు వద్ద గొలుసన్నను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement