ఆసుపత్రి పాలవుతున్నాం | - | Sakshi
Sakshi News home page

ఆసుపత్రి పాలవుతున్నాం

Oct 9 2026 1:38 AM | Updated on Oct 9 2026 1:38 AM

ఆసుపత్రి పాలవుతున్నాం వారానికి ఒకసారి తాగునీరు డబ్బులు లేవంటున్నారు ఎంతకాలం ‘చీకటి’ పాలన? నీళ్లకు ఇబ్బందులు పడుతున్నాం

మా కాలనీలో చెత్తాచెదారం నిండిపోయింది. డ్రైనేజీ కాలువలు పేరుకుపోయాయి. నెలలు గడుస్తున్నా పట్టించుకోవడం లేదు. ఎన్నోసార్లు సచివాలయానికి వెళ్లి చెప్పినప్పటికీ పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. అనారోగ్యంపాలై ఆసుపత్రి పాలవుతున్నాం.

– వీరభద్రస్వామి, పెద్దతుంబళం, ఆదోని మండలం

మా ఊరికి వారానికి ఒక సారి మాత్రమే తాగునీరు వస్తోంది. గ్రామంలో బోర్లు లేవు. అధికారులు వచ్చి సమస్య పరిష్కరిస్తామని అంటున్నారు కానీ..ఇంత వరకు రాలేదు. ఇప్పటికై నా ఉన్నాతాధికారులు మా గ్రామాన్ని సందర్శించి తాగునీటి సమస్యను పరిష్కరించాలి.

– ఈరమ్మ, కనకవీడు, నందవరం మండలం

గ్రామంలో ఎక్కడ చూసినా కాల్వలో మురుగు నీరు నిండి దుర్వాసన వస్తోంది. దోమలు వ్యాప్తి చెంది అంటురోగాలు వస్తున్నాయి. రాత్రిల్లో వీధి లైట్లు వెలగడం లేదు. ఎన్ని సార్లు చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదు. అడిగితే పంచాయతీలో డబ్బులు లేవంటున్నారు. మా గ్రామ సమస్య ఎవరితో చెప్పుకోవాలో అర్థం కావడం లేదు.

– బోయ నాగేంద్ర, సజ్జలగుడ్డం, కోసిగి మండలం

మా గ్రామంలో ఐదు నెలల కాలంలో ఒక్కసారి మాత్రమే వీధి బల్బులు వేశారు. వీధి బల్బులు వెలగక నెల రోజులకు పైగా అవుతున్నా పట్టించుకోవడం లేదు. రాత్రి పూట ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నాం. ఎంత కాలం ‘చీకటి’ పాలన ఉంటుందో అధికారులే సమాధానం చెప్పాలి.

– మహేష్‌, నాగమల్లకుంట, బేతంచెర్ల మండలం

ఎస్సీ కాలనీలో రెండు నెలలుగా కుళాయిలకు నీళ్లు సరిగా రాక ఇబ్బందులు పడుతున్నాం. నీళ్లు వదలగానే ఊర్లో మోటార్లు ఆన్‌చేసుకుంటారు. మాకాలనీ వరకు నీళ్లు ఎక్కడం లేదు. కుళాయి వద్ద నీళ్ల కోసం బిందెలు పెట్టి ఎదురుచూడాల్సి వస్తుంది. కూలీ పనులకు వెళితే ఇంట్లో నీళ్లు ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. అధికారులు చర్యలు తీసుకొని నీటి సమస్య పరిష్కరించాలి.

– మల్లేశ్వరి, అబ్దులాపురం,

కొలిమిగుండ్ల మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement