ట్యాంక్‌లు పాచితో పేరుకుపోయి నీటిలో తోక పురుగులు వస్తున్నాయి. నెల రోజులుగా అధికారులకు చెబుతున్నాం. ట్యాంక్‌లకు రంగు ముఖ భాగం మాత్రమే కొట్టారు. లోపల అలాగే వదిలేశారు. ఎన్నాళ్లైందో శుభ్రం చేసి తెలియడం లేదు. గ్రామానికి ప్రత్యేక అధికారులు ఎప్పుడు వస్తున్నారో ఎప్పుడు పోతున్నారో తెలియదు. సమస్యలను ఎవ్వరికి చెప్పాలో అర్థం కావడం లేదు.
– దామోదర్, నెహ్రూనగర్, పగిడ్యాల మండలం
ప్రత్యేక అధికారుల పాలన మొదలై మూడు నెలలు కావస్తున్నా వారి ఆచూకీ ఇంత వరకు తెలియడం లేదు. గ్రామాల వైపు చూడకుండా పట్టణాలకే పరిమితం అవుతున్నారు. గ్రామాల్లో సమస్యలు పేరుకపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎవరితో చెప్పుకోవాలో తెలియక సతమతమవుతున్నాం.
– శివానందరెడ్డి జగదూర్తి గ్రామం, డోన్ మండలం
రాత్రి అయ్యేసరికి దోమలు రక్తం పీలుస్తున్నాయి. అధికారులు ఫాగింగ్ చేయించి దోమల బెడద నుంచి విముక్తి కల్పించాలి. ఇక పారిశుద్ధ్యం లోపించడంతోనే ఈ సమస్య ఎదురవుతుంది. ప్రత్యేక పాలనలో ఎలాంటి ప్రత్యేకత లేదు. సర్పంచులు ఉన్నప్పుడు పనులు బాధ్యతగా చేస్తుండేవారు. అధికారులు స్పదించి పల్లె సమస్యలను పరిష్కరించాలి.
– దశరథరామిరెడ్డి, అమ్మిరెడ్డినగరం
సర్పంచ్‌ల పదవీకాలం ముగిసిన తర్వాత గ్రామాల్లో ప్రత్యేక పాలన అమల్లోకి వచ్చింది. గ్రామానికి నియమించిన ప్రత్యేకాధికారి మొక్కుబడిగా గ్రామాన్ని సందర్శిస్తున్నారు. గ్రామంలో రెండు మినరల్‌వాటర్‌ఫ్లాంట్లు పనిచేయక తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కాల్వల్లో మురుగు తొలగింపు, వీధిదీపాలు వెలగక రాత్రి వేళల్లో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. వర్షాకాలం కావడంతో కనీసం వీధుల్లో ఫాగింగ్ సైతం చేయకపోవడంతో దోమలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. – బాలమద్దిలేటి, అమడాల,
కోవెలకుంట్ల మండలం


