మహిళా సబ్‌ జైల్‌కు మోక్షమెన్నడో! | - | Sakshi
Sakshi News home page

మహిళా సబ్‌ జైల్‌కు మోక్షమెన్నడో!

Oct 9 2026 1:38 AM | Updated on Oct 9 2026 1:38 AM

● 15 ఏళ్ల క్రితం మూత పడిన బ్రిటీష్‌కాలం నాటి జైలు ● మహిళా సబ్‌జైలుగా మారుస్తామని అప్పటి హోం మంత్రి హామీ ● ఖైదీలు, న్యాయవాదులు, కక్షిదారులకు తప్పని వ్యయప్రయాసలు

బెయిల్‌ పిటిషన్లు వేసేందుకు ఇబ్బంది

సబ్‌ జైలును పున:ప్రారంభించాలి

● 15 ఏళ్ల క్రితం మూత పడిన బ్రిటీష్‌కాలం నాటి జైలు ● మహిళా సబ్‌జైలుగా మారుస్తామని అప్పటి హోం మంత్రి హామీ ● ఖైదీలు, న్యాయవాదులు, కక్షిదారులకు తప్పని వ్యయప్రయాసలు

కోవెలకుంట్ల: బ్రిటీష్‌కాలంలో ఏర్పాటు చేసిన కోవెలకుంట్ల సబ్‌ జైలును మూసి వేయడంతో ఆ స్థానంలో ఏర్పాటు చేస్తామన్న మహిళా సబ్‌ జైలు 15 ఏళ్ల నుంచి కలగా మిగిలిపోయింది. సాక్షాత్తు అప్పటి హోం మంత్రి కోవెలకుంట్లకు వచ్చిన సందర్భంగా మహిళా సబ్‌జైలు ఏర్పాటుకు ఇచ్చిన హామీ దశాబ్దన్నర కాలం గడిచినా ఒక్క అడుగు కూడా ముందుకు కదలలేదు. మరమ్మతుల పేరుతో అప్పట్లో సబ్‌ జైలును మూసివేశారు. స్థానిక పోలీస్‌ సర్కిల్‌ పరిధిలోని కోవెలకుంట్ల, సంజామల, ఆళ్లగడ్డ సర్కిల్‌ పరిధిలోని ఉయ్యాలవాడ, దొర్నిపాడు మండలాల్లో ఐదు పోలీస్‌స్టేషన్లులున్నాయి. ఆయా స్టేషన్ల పరిధిలో నేరాలకు పాల్పడిన నిందితులను రిమాండులో ఉంచేందుకు వీలుగా బ్రిటీష్‌ కాలంలోనే జిల్లాలో ఎక్కడా లేనివిధంగా పట్టణ శివారు లోని కుందూనది ఒడ్డున రెండు అంతస్తులతో కూడిన జైలు గదులు నిర్మించారు. ఈ సబ్‌ జైలుకు వందేళ్లకు పైగా చరిత్ర ఉంది. 15 ఏళ్ల క్రితం సబ్‌ జైలును మూసివేసి ఇక్కడ పనిచేస్తున్న జైలు సిబ్బందిని ఇతర ప్రాంతాలకు బదిలీ చేసి ఖైదీలను బనగానపల్లె, ఆళ్లగడ్డ సబ్‌ జైళ్లకు తరలించారు.

బదిలీపై వెళ్లేందుకు జైల్‌ను మూసేసిన అధికారి?

అప్పట్లో ఇక్కడ పని చేసిన ఒక జైలు వార్డర్‌ నిర్వాకంతోనే జైలు మూతపడినట్లు ఆరోపణలు ఉన్నా యి. కోస్తా జిల్లాకు చెందిన ఆ అధికారిని ఇక్కడికి బదిలీ చేయడంతో ఈ ప్రాంతంలో విధులు నిర్వర్తించడానికి ఇష్టం లేక బ్రిటీష్‌ కాలంలో నిర్మించిన జైలు కావడంతో శిథిలావస్థకు చేరుకుందని, ఇక్కడి ఖైదీలకు భద్రత లేదని, మౌలిక సదుపాయాలు సరిగా లేవని ఉన్నతాఽధికారులకు తప్పుడు నివేదికలు సమర్పించి మూసివేయించారు. ఇప్పటికీ జైలు గదులు చెక్కుచెదరలేదు. జైలు వార్డర్‌ బదిలీపై వెళ్లేందుకు ఏకంగా జైలును మూసివేయించాడని అప్పట్లో దుమారం రేగింది. ఐదు మండలాలకు అనుకూలంగా ఉన్న సబ్‌ జైలును ఎలాంటి కారణం లేకుండా మరమ్మతుల పేరిట మూసివేయడంతో ఖైదీలతో పాటు వారిని చూసేందుకు వచ్చే బంధు వులు, బెయిల్‌, ఇతర విషయాలు తెలుసుకునే న్యాయవాదులు, ఖైదీలను తరలించే పోలీసులు తప్పని వ్యవప్రయాసలు ఎదుర్కొంటున్నారు.

హోంమంత్రి హామీ ఇచ్చినా

ప్రయోజనం శూన్యం..

2010లో కోవెలకుంట్లలో పోలీస్‌స్టేషన్‌ నూతన భవన నిర్మాణానికి అప్పటి రాష్ట్ర హోంశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సబ్‌ జైలు పునః ప్రారంభించాలని న్యాయవాదులు, ప్రజా సంఘాలు మంత్రిని కోరగా జైలు మూతపడటానికి గల కారణాలను పరిశీలించి పునఃప్రారంభానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తిరిగి 2012 డిసెంబర్‌ నెలలో నూతన పోలీస్‌స్టేషన్‌ భవన ప్రారంభోత్సవానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. రాష్ట్రంలో కొన్ని చోట్ల కొత్తగా మహిళా సబ్‌జైళ్లు ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు ఇందులో భాగంగా కోవెలకుంట్లలో మహిళా సబ్‌ జైలు ఏర్పాటు చేస్తామని అప్ప ట్లో హామీ ఇచ్చారు. అనంతరం చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల దృష్ట్యా హోంమంత్రి పదవికి రాజీనామా చేయడం, 2014 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం, చంద్రబాబు సర్కార్‌ జైలు పునఃప్రారంభానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు సబ్‌జైలు పునఃప్రారంభం కాకపోవడంతో పాటు మహిళా సబ్‌జైలు ఏర్పాటు హామీ నీటి మూటగా మారింది.

పోలీసులు, న్యాయవాదులకు కష్టాలు..

రెండు పోలీస్‌ సర్కిళ్ల పరిధిలోని మండలాల్లో ఉన్న పోలీస్‌స్టేషన్లు సబ్‌ జైలుకు 10 నుంచి 18 కిమీ దూరంలోనే ఉన్నాయి. ఆయా పోలీస్‌స్టేషన్ల పరిధిలో నేరాలకు పాల్పడిన నిందితులను జైలు పక్కనే ఉన్న జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో హాజరు పరిచేవారు. ఖైదీలకు రిమాండ్‌ పడినా, శిక్ష విధించినా పక్కనే ఉన్న జైలుకు తరలించేవారు. సబ్‌ జైలు మూత పడటంతో రిమాండ్‌, శిక్ష పడ్డ ఖైదీలను ఆళ్లగడ్డ, బనగానపల్లె పట్టణాల్లో ఉన్న సబ్‌జైళ్లకు తరలిస్తున్నారు. ఏడాది క్రితం బనగానపల్లె సబ్‌జైలు మూత పడటంతో పురుష ఖైదీలను ఆళ్లగడ్డ, నంద్యాల, కడప జైళ్లకు, మహిళా ఖైదీలను కర్నూలుకు తరలిస్తున్నారు. ఆయా మండలాలకు జైళ్లు సుదూరం కావడంతో ఖైదీలను తరలించేందుకు పోలీసులు ఇబ్బందులు పడుతున్నారు. జైలులో ఉన్న ఖైదీలతో వారి బంధువులు ములాఖత్‌ అయ్యేందుకు అంతదూరం వెళ్లేందుకు కష్టతరంగా మారింది. రిమాండ్‌ ఖైదీలకు బెయిల్‌ పిటిషన్‌ వేసేందుకు సైతం న్యాయవాదులు అంతదూరం వెళ్లాల్సి వస్తోంది. ఐదు పోలీస్‌స్టేషన్లకు అందుబాటులో ఉన్న సబ్‌జైలు పునఃప్రారంభానికి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

బ్రిటీష్‌కాలంలో నిర్మించిన కోవెలకుంట్ల సబ్‌ జైలుకు వందేళ్ల చరిత్ర ఉంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎక్కడా లేని విధంగా అంతస్తులతో అప్పట్లో ఇక్కడ సబ్‌జైలు నిర్మించారు. కోర్టు పరిధిలోని ఐదు పోలీస్‌స్టేషన్లకు సబ్‌జైలు అందుబాటులో ఉండేది. కొన్ని అనివార్య కారణాలతో 15 ఏళ్ల క్రితం సబ్‌ జైలు మూత పడింది. జైలు మూత పడినా ఇప్పటికి జైలు గదులు చెక్కు చెదరకుండా ఉన్నాయి. సబ్‌జైలు లేకపోవడంతో బెయిల్‌ పిటిషన్లు వేయాలంటే ఆళ్లగడ్డ, కడప జైళ్ల వద్దకు వెళ్లాల్సి వస్తోంది.

– తిరుపేలు, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, కోవెలకుంట్ల

కోవెలకుంట్లలో మూతపడ్డ సబ్‌ జైలును పున:ప్రారంభించడమే కాకుండా మహిళా సబ్‌ జైలు ఏర్పాటు చేస్తామని అప్పటి హోం మంత్రి హామీ ఇచ్చారు. ఆ తర్వాత రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితు ల దృష్ట్యా హామీ కనుమరుగైంది. సబ్‌ జైలు లేకపోవడంతో రిమాండ్‌, శిక్ష పడ్డ ఖైదీలను దూర ప్రాంతాల్లో ఉన్న జైళ్లకు తీసుకెళ్లాల్సి వస్తోంది. ప్రజా ప్రతినిధులు, జిల్లాస్థాయి అధికారులు చొరవ చూపి జైలును పున: ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలి.

– డీసీ ఉసేన్‌, న్యాయవాది, కోవెలకుంట్ల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement