ఆళ్లగడ్డ: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అహోబిలంలో శ్రీ అహోబిల మఠం స్థాపకులు, ప్రథమ పీఠాధిపతి శ్రీమాన్ ఆదివణ్ శఠకోప స్వామి తిరునక్షత్ర మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మూడో రోజు గురువారం వేకువజామునే స్వామి, అమ్మవార్లను సుప్రభాత సేవతో మేల్కొలిపి దివ్యదర్శనం అనంతరం నిత్యపూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఉత్సవమూర్తి ఆదివణ్ శఠకోప స్వామి ఉత్సవ విగ్రహం కొలువుంచి అర్చన, అభిషేకం నిర్వహించారు. పూజలు పూర్తయిన తర్వాత ప్రత్యేకంగా అలకరించిన ఉత్సవ పల్లకీలో స్వామి ఉత్సవ విగ్రహాన్ని ఉంచి మాడ వీధుల్లో గ్రామోత్సవం చేపట్టారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.


