జిల్లాలో రబీ పంటల
సాగు వివరాలు
కోవెలకుంట్ల సమీపంలో పొలంలో రసాయన మందు విత్తుతున్న దృశ్యం
కోవెలకుంట్ల: నంద్యాల జిల్లాలోని 29 మండలాల పరిధిలో ఈ ఏడాది రబీలో 1.93 లక్షల హెక్టార్లలో వరి, జొన్న, కంది, మొక్కజొన్న, పప్పుశనగ, మినుము, ధనియాలు, వేరుశనగ, తదితర పంటల సాగు లక్ష్యం. జిల్లాలో అక్టోబర్ నెలలో సాధారణ వర్షపాతం 117.9 మి.మీ కాగా ఇప్పటి వరకు వరకు ఒక్క మి.మీ. నమోదు కాలేదు. తుపాన్ ప్రభావంతో ఈ నెల 10వ తేదీ నుంచి వర్షాలు కురుస్తాయని ముందుగా ప్రకటించినా ఎండతీవ్రత నేపథ్యంలో మరో ఐదు రోజులపాటు వర్షాలు లేవని వాతావరణ శాఖ తెలియజేయడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నీరు ఉన్నా రైతుకు కన్నీరే!
శ్రీశైలం జలాశయంలో ఆగస్టు, సెప్టెంబర్ నాటికి పుష్కలంగా నీరు ఉంది. వివిధ పంటల సాగుకు ఎస్సార్బీసీ, కేసీకెనాల్, తెలుగుగంగ, కుందూనది, పాలేరు, కుందరవాగులకు నీటిని విడుదలచేయలేదు. వాటి పరిధిలో రైతులు ఒక్క ఎకరా సాగు చేయలేకపోయారు. ఖరీఫ్‌లో జిల్లాలో 2.21 లక్షల హెక్టార్లలో వివిధ పంటలు సాగు కావాల్సి ఉంది. అయితే వర్షాధారం, బావులు, బోర్ల కింద 1.38 లక్షల హెక్టార్లలో వరి, పత్తి, మినుము, వేరుశనగ, మొక్కజొన్న, కంది, తదితర పంటలను సాగు చేశారు. సెప్టెంబర్ నెల మినహా మిగిలిన ఏ ఒక్క నెలలో కూడా ఆశించిన స్థాయిలో వర్షాలు కురియలేదు.
నష్టాల దిగుబడి
మినుములో విత్తనాలు, రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు తదితర పెట్టుబడుల రూపంలో ఎకరాకు రూ. 20 వేలకు పైగా పెట్టుబడులు వెచ్చించారు. వర్షాభావ పరిస్థితులతో ఎకరాకు అరబస్తా మించి దిగుబడులు రాలేదు. బోర్లు, బావులు, చెరువుల ఆధారంగా సాగు చేసిన మొక్కజొన్న చేతికందగా ఇటీవలే కోత, నూర్పిడి పనులు చేపట్టారు. ఎకరాకు 15 క్వింటాళ్లకు మించి దిగుబడులు రావడం లేదని రైతులు వాపోతున్నారు. కంది విత్తనం వేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క దఫా కూడా వర్షం పడకపోవడంతో పైరులో ఎదుగుదల నిలిచిపోయింది.
రబీకి ప్రణాళిక కరువు
ఖరీఫ్‌లో పెట్టుబడులు నేలపాలై రైతులు నష్టాలు మూటగట్టుకున్నారు. సెప్టెంబర్ నెలలో కురిసిన వర్షాలతో రబీ సాగుపై మళ్లీ ఆశలు పెట్టుకున్నారు. కాని చంద్రబాబు ప్రభుత్వం ముందస్తు పంటల సాగు ప్రణాళికను సిద్ధం చేయకుండా నిర్లక్ష్యం వహించింది. పప్పుశనగ, మినుము, వేరుశనగ విత్తనాలను అరకొరగా కేటాయింపులు చేసి చేతులు దులుపుకుంది. రైతులు మాత్రం భూమిలో ఉన్న అంతంత మాత్రం పదునుపైనే ఇప్పటికే జొన్న, మినుము పంటలను సాగు చేశారు. ఈ నెలలో విస్తారంగా పప్పుశనగ సాగు కావాల్సి ఉండటంతో విత్తనానికి పొలాలను రెడీ చేసుకుంటున్నారు. ఈ నెలాఖరు నాటికి వర్షం కురియకపోతే శనగతో పాటు ఇతర విత్తనాలు వేయలేరు.
అందని సబ్సిడీ విత్తనాలు!
ప్రభుత్వం సబ్సిడీపై అరకొరగా శనగ విత్తనాలు సరఫరా చేస్తోంది. మార్కెట్‌లో క్వింటా రూ. 7 వేలకు పైగా ధర పలుకుతుండగా ప్రభుత్వం క్వింటా రూ. 5,850 ప్రకారం అందజేస్తోంది. రైతులు విత్తనాలు కొనుగోలు చేసేందుకు ఎగబడుతున్నారు. రైతు సేవా కేంద్రాల్లో విత్తనాలు లేకపోవడంతో ఊసూరుమంటూ వెనుదిరిగాల్సి వస్తోంది. జిల్లాలో ఆయా మండలాల పరిధిలో 59,135 హెక్టార్లలో శనగ సాగు సాధారణ విస్తీర్ణం ఉంది. ఇందులో కోవెలకుంట్ల వ్యవసాయ సబ్ డివిజన్‌లో అత్యధికంగా సాగు కావాల్సి ఉంది.
పంటరకం సాధారణ విస్తీర్ణం
(హెక్టార్లలో)
పప్పుశనగ 59,135
వరి 37,562
మొక్కజొన్న 23,084
మినుము 19,109
కంది 3,552
వేరుశనగ 2,832
రబీలో వర్షాలు కరువు
బీడుభూములుగా పొలాలు
అరకొరగా సబ్సిడీ విత్తనాలు
ఇస్తున్న ప్రభుత్వం
ఈ ఏడాది శనగ సాగు లేనట్లే!


