నేడు మద్యం దుకాణాలకు లక్కీడిప్
కర్నూలు: ఉమ్మడి కర్నూలు జిల్లాలో రెన్యువల్ కాని 44 మద్యం దుకాణాలను లాటరీ ద్వారా కేటాయించనున్నారు. కర్నూలు జిల్లాలో 17 దుకాణాలకు 62 దరఖాస్తులు రాగా, నంద్యాల జిల్లాలో 27 దుకాణాలకు 71 దరఖాస్తులు కలిపి మొత్తం 133 దరఖాస్తులు దాఖలయ్యాయి. కనీసం నాలుగు దరఖాస్తులు తక్కువ కాకుండా వచ్చిన దుకాణాలకు మాత్రమే లాటరీ విధానంలో దుకాణం కేటాయించి లైసెన్స్ జారీ చేయనున్నారు. ఎకై ్సజ్ జాయింట్ కమిషనర్ నాగలక్ష్మి నోడల్ అధికారిగా ఉమ్మడి జిల్లాలో పర్యటించి ఎక్కువ దరఖాస్తులు రాబట్టేందుకు అధికారులపై ఒత్తిడి పెంచినప్పటికీ వ్యాపారులు మొండికేశారు. జిల్లా అధికారులు రెండుసార్లు నోటిఫికేషన్ జారీ చేసి రెన్యువల్ కాని మద్యం దుకాణాలకు కచ్చితంగా దరఖాస్తులు వేసుకోవాలని వ్యాపారులపై ఒత్తిడి పెంచి వేయించడంతో కర్నూలు జిల్లాలో 15 దుకాణాలకు, నంద్యాల జిల్లాలో 16 దుకాణాలకు నాలుగేసి దరఖాస్తులు వచ్చాయి. కర్నూలు జిల్లాకు సంబంధించి జిల్లాపరిషత్ భవనంలో, నంద్యాల జిల్లాకు సంబంధించి కలెక్టర్ ఆఫీస్‌లోని వీసీ హాల్‌లో గురువారం ఉదయం 8 గంటలకు లక్కీడిప్ నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా అధికారులు సుధీర్ బాబు, రవికుమార్ లక్కీడిప్‌కు తగిన ఏర్పాట్లు చేశారు.
మరోసారి రీనోటిఫికేషన్
కర్నూలు జిల్లాలో రెండు, నంద్యాల జిల్లాలో 11 దుకాణాల రెన్యూవల్ ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నాయి. వీటికి మరోసారి కలెక్టర్ల అనుమతితో రీనోటిఫికేషన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానించి లక్కీడిప్‌లో వరించిన వారికి కేటాయించనున్నట్లు అధికారులు వెల్లడించారు. కర్నూలు జిల్లా కరువు ప్రాంతమైనప్పటికీ దరఖాస్తుల ద్వారా రూ.1.86 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది.
ఉమ్మడి జిల్లాలో 44 దుకాణాలకు
133 దరఖాస్తులు
నాలుగు దరఖాస్తులు వచ్చిన
వాటికే లాటరీ


