మిద్దె దూలం విరిగిపడి బాలిక మృతి | - | Sakshi
Sakshi News home page

మిద్దె దూలం విరిగిపడి బాలిక మృతి

Oct 8 2026 3:36 AM | Updated on Oct 8 2026 3:36 AM

ఆదోని రూరల్‌: మండలంలోని బల్లేకల్‌ గ్రామంలో మంగళవారం సాయంత్రం ఓ బాలికపై మిద్దె దూలం పడి మృతిచెందిన సంఘటన ఆలస్యంగా తెలిసింది. వివరాలు.. గ్రామానికి చెందిన కోసిగి నరసప్ప, అయ్యమ్మ దంపతులకు నలుగురు కుమార్తెలు. మూడో కుమార్తె మేఘన (7) ఇంటి ముందున్న అరుగుపై ఆడుకుంటుండగా అకస్మాత్తుగా మిద్దె దూలం విరిగి మీద పడింది. దీంతో తీవ్రంగా గాయపడిన మేఘనను చికిత్స నిమిత్తం ఆదోని పట్టణంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించగా రాత్రి మృతి చెందినట్లు తల్లిదండ్రులు తెలిపారు. బుధవారం బాలిక మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. మిద్దె పాతది కావడంతో దూలం విరిగి పడిందని తల్లిదండ్రులు వాపోయారు. కుమార్తె మృతితో తల్లిదండ్రులు, బంధువులు రోధించిన తీరు అక్కడివారిని కలచివేసింది.

నకిలీ మద్యం అరికట్టండి

కర్నూలు: జిల్లాలోకి నకిలీ మద్యం రాకుండా పాత నేరస్తులపై నిఘా పెంచాలని ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ డిప్యూటీ కమిషనర్‌ పి.శ్రీదేవి క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించారు. ఎకై ్సజ్‌ ప్రధాన కార్యాలయంలో కర్నూలు, నంద్యాల జిల్లాల ఎకై ్సజ్‌ స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్లతో బుధ వారం నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలు, దసరా పండుగ, దేవరగట్టు బన్ని ఉత్సవా ల సందర్భంగా పాత నేరస్తులు నకిలీ, పొరుగు రాష్ట్రాల మద్యం, నాటుసారా సరఫరా చేసే అవకాశమున్నందున నిఘా ఉంచాలని సూచించారు.

దుకాణాల షిఫ్టింగ్‌కు సరైన కారణాలతో ప్రతిపాదనలు పంపండి

రెన్యువల్‌ అయిన మద్యం షాపుల యజమానులు వారి షాపులను మరోచోటికి షిఫ్టింగ్‌ చేయదలిస్తే సహేతుక కారణాలతో సంబంధిత డీపీఈఓల ద్వారా ప్రతిపాదనలు పంపాలన్నారు. కర్నూలు జిల్లాలో రెండు, నంద్యాల జిల్లాలో 11 మద్యం షాపులకు దరఖాస్తులు రాలేదని అందుకు కారణాలను విశ్లేషించి తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఆ 13 షాపులకు త్వరలో రీ నోటిఫికేషన్‌ విడుదల చేసి ఔత్సాహిక వ్యాపారులను గుర్తించి పాలసీ విధివిధానాలు తెలియజేయాలన్నారు. ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక ఏర్పాటు చేసుకుని ఎన్‌ఫోర్స్‌మెంట్‌, ఈఎస్‌టీఎఫ్‌ సిబ్బంది జిల్లా వ్యాప్తంగా ముమ్మర దాడులు నిర్వహించాలని సూచించారు. పాత నేరస్తులను తహసీల్దార్ల ఎదుట బైండోవర్‌ చేయాలన్నారు. అసిస్టెంట్‌ కమిషనర్‌ రావిపాటి హనుమంతరావు, జిల్లా అధికారి మచ్చ సుధీర్‌ బాబు, ఏఈఎస్‌లు రాజశేఖర్‌ గౌడ్‌, రామకృష్ణా రెడ్డి, విజయ్‌కుమార్‌లతో పాటు ఎకై ్సజ్‌ ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.

వరుణదేవా కరుణించు

మహానంది: రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన దేవాలయాల్లో నిర్వహిస్తున్న వరుణయాగంలో భాగంగా మహానంది క్షేత్రంలో రెండోరోజైన బుధవారం సహస్రవార వరుణయాగం, వరుణమంత్ర జపాలను శాస్త్రోక్తంగా చేపట్టారు. ఆలయ ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వేదపండితులు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర అవధాని, ఆలయ ప్రధాన అర్చకులు మామిళ్లపల్లి అర్జునశర్మ, నాగేశ్వరశర్మ, హనుమంతుశర్మ, రుత్వికులు ఉదయం నుంచి సాయంత్రం వరకు విశేష పూజలు నిర్వహించారు. రుద్రగుండం కోనేరులో వరుణ మంత్రజపాలు చేశారు. పలు ప్రాంతాల భక్తులు వరుణయాగం పూజలను తిలకించి శ్రీ కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వర స్వామివార్లను దర్శించుకుని భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement