నర్సింగ్‌ విద్యార్థులతో వైద్యసేవలు | - | Sakshi
Sakshi News home page

నర్సింగ్‌ విద్యార్థులతో వైద్యసేవలు

Oct 8 2026 3:36 AM | Updated on Oct 8 2026 3:36 AM

● రోగుల ప్రాణాలతో చెలగాటం

● రోగుల ప్రాణాలతో చెలగాటం

కర్నూలు(హాస్పిటల్‌): కాంట్రాక్టు పారామెడికల్‌ ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో అత్యవసర పరిస్థితులు నెలకొన్నాయి. ఆసుపత్రిలో 535 మంది కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తుండగా అందులో 450 మంది స్టాఫ్‌నర్సులు, మిగిలిన వారు ల్యాబ్‌టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు, రేడియోగ్రాఫర్లు, ఈసీజీ, ఈఎంటీ టెక్నీషియన్లు, పారామెడికల్‌ సిబ్బంది ఉన్నారు. కాంట్రాక్టు స్టాఫ్‌నర్సుల స్థానంలో వివిధ విభాగాలు, కళాశాలల నుంచి 160 మంది స్టాఫ్‌ నర్సులు, హెడ్‌ నర్సులను నియమించారు. మిగిలిన వారి స్థానంలో భారీ ఎత్తున 1800 మంది దాకా నర్సింగ్‌ విద్యార్థినులను వివిధ ప్రైవేటు కాలేజీల నుంచి రప్పించారు. ఆయా కళాశాలల్లో తరగతులు బంద్‌ చేసి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు అందించాలని ఆసుపత్రి అధికారులు ఆదేశించి పిలిపించారు. దీంతో ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు తప్పనిసరై విద్యార్థినులను ఆసుపత్రికి పంపించారు. వీరిలో అధిక శాతం ఇంకా నర్సింగ్‌ విద్యను అభ్యసించడంలో ఇంకా శిక్షణ పొందుతూ ఉన్నారు. ఇలాంటి వారితో రోగులకు వైద్య సేవలు అందించే ఏర్పాటు చేయడం విమర్శలకు తావిస్తోంది. తప్పుడు వైద్యసేవలు అందించడం వల్ల రోగులకు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. డయాగ్నోస్టిక్‌ బ్లాక్‌, ఫార్మసీ కౌంటర్లలోనూ ఆయా పారామెడికల్‌ కాలేజీల నుంచి విద్యార్థులను రప్పించి సేవలందిస్తున్నారు. డయాగ్నోస్టిక్‌ బ్లాక్‌లోని బయోకెమిస్ట్రీ ల్యాబ్‌లో వైద్య పరీక్షలను విద్యార్థుల చేత చేయిస్తే, తప్పుడు ఫలితాలతో వైద్యం చేయిస్తే బాధ్యత ఎవరిదన్న వాదనలు వినిపిస్తున్నాయి. అధికారులు మాత్రం సమ్మె నేపథ్యంలో తాము భారీగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని చెప్పుకోవడం గమనార్హం.

జేఏసీ నాయకులకు

షోకాజ్‌ నోటీసులు

అత్యవసర వైద్య సేవలను బహిష్కరించి సమ్మె చేస్తున్న కాంట్రాక్టు పారామెడికల్‌ ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపునకు పాల్పడుతోంది. ఇందులో భాగంగా బుధవారం ఏపీ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ కాంట్రాక్టు ఉద్యోగుల జేఏసీ కర్నూలు చైర్మన్‌ శ్రీదేవి, నాయకులు నరేంద్రకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ఉన్నతాధికారుల నుంచి వారికి నోటీసులు జారీ చేయాలని ఆదేశాలు అందాయి. వీరితో పాటు సమ్మెలో పాల్గొంటున్న ప్రతి కాంట్రాక్టు ఉద్యోగికి షోకాజ్‌ నోటీసులు జారీ చేసి, అవసరమైతే విధుల నుంచి తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. ఎలాగైనా సమ్మెను అణిచివేసేందుకు ప్రభుత్వం ఎస్మా చట్టం పేరుతో షోకాజ్‌ నోటీసులు, డిస్మిస్‌ అస్త్రాలను సంధిస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement