బనగానపల్లె: మండలంలో నందివర్గం పోలీసుస్టేషన్ పరిధిలోని అదే గ్రామానికి చెందిన మనోహర్ (26) చికిత్స పొందుతూ కోలుకోలేక బుధవారం మృతిచెందినట్లు ఎస్‌ఐ భూపాలుడు తెలిపారు. మనోహర్ ఆన్‌లైన్ బెట్టింగ్‌లతో పాటు ఇతర అప్పుల బాధతో జీవితంపై విరక్తి చెంది ఈ నెల 1న ఇంట్లో కత్తితో గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబసభ్యులు కర్నూలు ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందాడు. ఘటనపై ఎస్‌ఐ తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన తిరుపాల్, అన్నపూర్ణ దంపతులకు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. పెద్ద కుమారుడు మనోహర్ రెండేళ్ల క్రితం బెట్టింగ్‌లో రూ.2 లక్షలతో పాటు చెల్లెలు వివాహం, ఇళ్లు రీమోడల్ కోసం ఆన్‌లైన్‌లో అప్పు చేశాడు. అప్పు తీర్చలేక జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్‌ఐ తెలిపారు. తండ్రి తిరుపాల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్‌ఐ వెల్లడించారు.
ఐవీ బాటిల్ పట్టుకొని ఉండాల్సిందే!
నందికొట్కూరు: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడిని వైద్యులు పట్టించుకోకుండా వదిలేసిన సంఘటన బుధవారం పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో చోటు చేసుకుంది. తలకు బలమైన గాయాలు కావడంతో పరిస్థితి విషమంగా ఉన్నా వైద్యులు పట్టించుకోలేదని బంధువులు ఆరోపణలు చేస్తున్నారు. ప్రాణపాయ స్థితిలో ఉన్న యువకుడికి ఐవీ ద్రావణం ఎక్కించేందుకు స్టాండ్ లేకపోవడంతో బంధువు 20 నిమిశాల పాటు ఆ బాటిల్‌ను చేతితో పట్టుకోవాల్సి వచ్చింది. ఐవీ స్టాండ్ ఏర్పాటు చేయకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
11 నుంచి దసరా శరన్నవరాత్రోత్సవాలు
మహానంది: మహానంది క్షేత్రంలో ఈ నెల 11వ తేదీ నుంచి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆయన బుధవారం మాట్లాడుతూ.. ఆలయంలో కొలువైన శ్రీ కామేశ్వరీదేవికి నిత్యం ప్రత్యేక అలంకరణలు ఉంటాయన్నారు. 11న శైలపుత్రిదుర్గ, 12న బ్రహ్మచారిణి దుర్గ, 13న చంద్రఘంట దుర్గ, 14న కూష్మాండ దుర్గ, 15న స్కందమాత, 16న కాత్యాయనీ, 17న కాళరాత్రి దుర్గ, 18న మహాగౌరీ, 19న సిద్ధిధాత్రి, 20న కామేశ్వరీదేవి నిజరూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారన్నారు.


