కాచిగూడ: సమయానుకూల నిర్ణయం, అధికారుల పక్కా సమన్వయం వందలాది మంది కాశీ యాత్రికుల ప్రయాణాన్ని సుఖమయం చేశాయి. నంద్యాలకు చెందిన ‘మన ఊరు మన గుడి మన బాధ్యత‘ సేవా సంస్థకు చెందిన 120 మందికి పైగా సభ్యుల బృందం వారణాసి(కాశీ) పుణ్యక్షేత్ర దర్శనానికి బయలుదేరారు. వారు గుంటూరు కాచిగూడ (రైలు నం. 17251) ఎక్స్ప్రెస్లో ప్రయాణించి, సికింద్రాబాద్ వద్ద కాశీ వెళ్లే దానాపూర్ ఎక్స్ప్రెస్ (రైలు నం. 12791) ఎక్కాల్సి ఉంది. అయితే, వారు ప్రయాణిస్తున్న రైలు ఆలస్యంగా నడుస్తుండటంతో కనెక్టింగ్ రైలు తప్పిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ విషయాన్ని గమనించిన ప్రయాణికులు వెంటనే రైల్వే అధికారులకు సమాచారం అందించారు. వెంటనే హైదరాబాద్ డివిజన్ ఆపరేటింగ్, కమర్షియల్ బృందాలు వేగంగా స్పందించాయి. ప్రయాణికుల సమయాన్ని ఆదా చేసేందుకు రైలును చివరి స్టేషన్ కాచిగూడ వరకు వెళ్లనివ్వకుండా, మార్గమధ్యంలో ఫలక్నుమా స్టేషన్లోనే యాత్రికులను దింపారు. అనంతరం వారిని సికింద్రాబాద్ వైపు వెళ్లే ఎంఎంటీఎస్ (రైలు నం. 47211) ఎక్కించారు. మరోవైపు సికింద్రాబాద్ డివిజన్ అధికారులతో సమన్వయం చేసుకుని, యాత్రికులు స్టేషన్లో త్వరితగతిన కాశీ రైలు ఎక్కేలా ప్రత్యేక ప్రాధాన్యత కల్పించారు.


