నిన్ను తాక మనసాయె.. ఉచిత సేవ దూరమాయె! | - | Sakshi
Sakshi News home page

నిన్ను తాక మనసాయె.. ఉచిత సేవ దూరమాయె!

Sep 24 2026 2:18 AM | Updated on Sep 24 2026 2:18 AM

2022లో మల్లన్న ఉచిత స్పర్శ దర్శన సేవ ప్రారంభం

మార్పులు చేసి ఆన్‌లైన్‌ టికెట్టు విధానం ప్రవేశం

పది నెలలుగా పర్వదినాలు,

ఉత్సవాల పేరుతో మంగళం

సామాన్య భక్తులకు దూరమైన

అరుదైన అవకాశం

శ్రీశైలంటెంపుల్‌: దేశంలో ఎక్కడా లేని విధంగా శ్రీశైలంలో మాత్రమే జ్యోతిర్లింగ స్వరూపుడైన మల్లికార్జున స్వామివారిని (చేతులతో తాకి) స్పర్శదర్శనం చేసుకునే భాగ్యం శ్రీశైలం క్షేత్రంలోనే ఉంది. ప్రతి ఒక్క భక్తుడు శ్రీశైల మల్లికార్జున స్వామివారిని స్పర్శదర్శనం చేసుకునేందుకు ఆరాటపడతారు. క్షేత్రంలో స్పర్శ దర్శనం టిక్కెటు రుసుం రూ.500గా దేవస్థానం నిర్ణయించింది. స్పర్శదర్శనం టికెట్టు పూర్తిగా ఆన్‌లైన్‌లో తీసుకోవాలి. మల్లన్న దర్శనానికి వచ్చే భక్తుల్లో ఎక్కువశాతం నిరాక్షరాస్యులు, సామాన్య భక్తులే వస్తారు. ఈ నేపథ్యంలో 2022లో సామాన్య భక్తుల సౌకర్యార్థం గతంలో ప్రతి మంగళవారం నుంచి శుక్రవారం వరకు రెండు పూటల మల్లన్న స్పర్శదర్శన భాగ్యాన్ని కల్పించారు. అటుతరువాత మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు కల్పించారు. అయితే శ్రీశైల దేవస్థానంలో ఒక్కొక్క సేవ పేదలకు దూరమవుతోంది. ఉచిత మల్లన్న స్పర్శదర్శనం కార్యక్రమానికి దేవస్థాన అధికారులు మంగళం పలకడంతో సామాన్య భక్తులు అరుదైన అవకాశానికి దూరమయ్యారు.

గతంలో రోజుకు 4 వేల మందికి అవకాశం..

ఉచిత స్పర్శ దర్శానాన్ని భక్తులు సద్వినియోగం చేసుకున్నారు. ప్రతి మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు మధ్యాహ్నం 1.30 నుంచి 2.30 గంటల వరకు సామా న్య భక్తులకు మల్లన్న ఉచిత స్పర్శదర్శనాన్ని 2022 సంవత్సరం కార్తిక మాసం నుంచి ప్రారంభించారు. అనంతరం డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమంలో భక్తుల విజప్తిని దృష్టిలో ఉంచుకుని దేవస్థాన కార్యనిర్వహణాధికారి మంగళవారం నుంచి సాయంత్రం వేళలలో కూడా 6.30గంటల నుంచి 7.30గంటల వరకు ఒక గంట పాటు సామాన్య భక్తులకు మల్లన్న స్పర్శదర్శనాన్ని కల్పించారు. అటు తరువాత ప్రతి మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 2గంటల నుంచి 4గంటల వరకు రెండు గంటల పాటు భక్తులకు ఉచితంగా మల్లన్న స్పర్శదర్శనాన్ని కల్పించారు. అటుతరువాత క్యూలైన్లలో వేచిఉన్న భక్తులకు ఆన్‌లైన్‌ టికెట్టు విధానం ద్వారా ఉచిత స్పర్శదర్శనాన్ని కల్పించారు. రోజుకు మూడు పూటలా దాదాపు 4 వేల మందికి స్వామి వారి ఉచిత స్పర్శ దర్శనాన్ని కల్పించారు. ఎంతో మంది సామాన్య భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు.

పది నెలలుగా మంగళం..

శ్రీశైల క్షేత్రంలో భక్తుల రద్దీ, పర్వదినాలు, ఉత్సవాలు, బ్రహ్మోత్సవా లు, శ్రావణమాసం, కార్తీకమాసం తదితర సాకులు చూపుతూ దాదాపు 10 నెలలుగా ఉచిత మల్లన్న స్పర్శదర్శన కార్యక్రమాన్ని నిర్వహించడం లేదు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే సామా న్య భక్తులు డబ్బులు పెట్టి ఆన్‌లైన్‌లో టికెట్టు పొందే స్థోమత లేని భక్తులు మల్లన్న స్పర్శదర్శనం చేసుకోకుండానే నిరాసతో వెనుదిరాగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికై న దేవస్థాన అధికారులు స్పందించి గతంలో మాదిరి ప్రతి మంగళవారం నుంచి శుక్రవారం వరకు ఉచిత స్పర్శదర్శనం కల్పించాలని పలువురు భక్తులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement