శ్రీశైలంటెంపుల్: వినాయకచవితి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీ నుంచి ప్రారంభమైన గణపతి నవరాత్రోత్సవాలు ముగిశాయి. బుధవారం స్వామివారి యాగశాలలో పూర్ణాహుతి జరిపించారు. ఈ ఉత్సవాల్లో ప్రతిరోజు రత్నగర్భ గణపతికి, సాక్షి గణపతికి, యాగశాలలో నెలకొల్పిన పంచలోహ వరసిద్ధి వినాయకస్వామికి, సాక్షిగణపతి ఆలయంలో నెలకొల్పిన మృత్తికా గణపతికి వ్రతకల్పపూర్వక పూజలు, మండపారాధనలు, ఉపనిషత్ పారాయణలు, జపానుష్ఠానాలు, గణపతిహోమం, సాయంకాలపూజలతో పాటు విశేష పూజలు సైతం జరిపించారు. అనంతరం లోకకల్యాణం కోసం జపాలు, నిత్యహోమ బలిహారణలు, గణపతిహోమం, జయాదిహోమం జరిపించారు. అనంతరం పూర్ణాహుతి, వసంతోతల్సవం, అవబృధం కార్యక్రమాలు జరిపించారు. పూర్ణాహుతి కార్యక్రమంలో శాస్త్రోక్తంగా నారికేళాలు, పలు సుగంధద్రవ్యాలు, మొదలైన ద్రవ్యాలను హోమగుండంలోకి ఆహుతిగా సమర్పి ంచి పూర్ణాహుతి కార్యక్రమాన్ని పూర్తి చేశారు. అవబృధం కార్యక్రమంలో వరసిద్ది వినాయకస్వామి పంచలోహ మూర్తికి ఆలయ ప్రాంగణంలో గల మల్లికాగుండంలో వైదిక శాస్త్రోక్తంగా స్నపన కార్యక్రమం నిర్వహించారు. అలాగే గణపతి నవరాత్రోత్సవాల సందర్భంగా సాక్షిగణపతి ఆలయంలో ఏర్పాటు చేసిన మృత్తికా గణపతిస్వామివారికి నిమజ్జనోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో శ్రీ శైల దేవస్థాన ట్రస్ట్‌బోర్డు చైర్మన్ పోతుగుంట రమేష్‌నాయుడు, ఈఓ శ్రీనివాసరావు, పలువురు ట్రస్ట్‌బోర్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


