పెద్దకడబూరు: స్కూలు వాహనం చక్రాల కింద నలిగి యస్విత (4) అనే చిన్నారి దుర్మరణం చెందిన సంఘటన నందవరం మండలం బాపురంలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించి వివరాలు.. బాపురం గ్రామానికి చెందిన చిన్నరంగన్న, ఉర్మిళ దంపతుల ఒక్కగానొక్క కూతురు యస్విత పెద్దకడబూరు మండలం హెచ్.మురవణి నాలుగవ మైలురాయి వద్ద ఉన్న అక్షరభారతి ఇంగ్లిష్ మీడియం స్కూల్‌లో నర్సరీలో చేరింది. స్కూలు యాజమాన్యం వారు ఆయా గ్రామాల నుంచి పిల్లలను ప్రైవేటు వాహనాలైన టాటా ఏసీ (టెంపో)లలో బడికి తీసుకొచ్చి సాయంత్రం ఇంటికి చేరుస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం టెంపోలో పిల్లలను ఎక్కించుకొని బాపురం గ్రామానికి వెళ్లారు. అక్కడ చిన్నారి టెంపో నుంచి దిగి ఇంటికి వెళ్లిపోతుంది. ఆటో డ్రైవర్ అజాగ్రత్తగా టెంపోను వెనుకకు పోనివ్వడంతో చిన్నారికి తగిలి కింద పడిపోయింది. పాప తలపై టెంపో టైరు ఎక్కడంతో అక్కడికక్కడే చనిపోయింది. ఆటో డ్రైవర్ పాపను ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి అక్కడి నుంచి పారిపోయాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఒక్కగానొక్క కూతురు చనిపోవడంతో వారి బాధ వర్ణనాతీతం.
యస్విత మృతికి కారణమైన స్కూల్‌ను సీజ్ చేయాలి
చిన్నారి యస్విత మృతికి కారణమైన అక్షర భారతి స్కూల్‌ను సీజ్‌చేసి యాజమాన్యంపై కేసు నమోదు చేయాలని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థి యువజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు శేఖర్‌నాయుడు, పీడీఎస్‌యూజిల్లా నాయకులు నరసింహారెడ్డి పీడీఎస్‌ఓ జిల్లా నాయకుడు సురేంద్రబాబు, యూఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకుడు సందీప్ బుధవారం పాఠశాల ముందు ధర్నా చేపట్టారు. విద్యార్థుల రవాణాకు స్కూలు బస్సులను ఏర్పాటు చేయకుండా ప్రైవేటు ఆటోలను ఏర్పాటు చేసి చిన్నారిని పొట్టన పెట్టుకున్నారని మండిపడ్డారు. జిల్లా అధికారులు చర్యలు చేపట్టి పాఠశాలను సీజ్ చేయాలని, బాధిత కుటుంబానికి రూ.25 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.


