● అధికారులను ప్రశ్నించిన
నిపుణుల కమిటీ సభ్యులు
కొలిమిగుండ్ల(అవుకు): అవుకు రిజర్వాయర్‌లో లీకేజీ నివారణకు ఏం చేశారని అధికారులను నిపుణుల కమిటీ సభ్యులు ప్రశ్నించారు. రిజర్వాయర్‌ను బుధవారం కృష్ణా రివర్స్‌మేనేజ్‌మెంట్ బోర్డు మాజీ చైర్మన్ ఆల్వాల పరమేశం, జలవనరుల శాఖ రిటైర్డ్ సీఈ లక్ష్మిరెడ్డి, రిటైర్డ్ ఈఈ శ్రీకాంత్, రిటైర్డ్ ప్రొఫెసర్ శివకుమార్ పరిశీలించారు. రిజర్వాయర్‌కు అనుసంధామైన పాలేరు స్లూయిస్ వద్ద జరుగుతున్న నీటి లీకేజీ గురించి ఆరా తీశారు. లీకేజీ లేకుండా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారని ఎస్సార్బీసీ అధికారులను అడిగారు. రిజర్వాయర్(తిమ్మరాజు కట్ట) వద్దకు చేరుకొని సింక్‌హోల్ సమస్యపై చర్చించారు. ఒకే చోట 2024, 2025లో కుంగిందని సంబంధిత అధికారులు వివరించారు. బండ్ కింద నుంచి వస్తున్న లీకేజిని అరికట్టేందుకు కర్ణాటకు నుంచి నిపుణులను పిలిపించామని, 30 శాతం నివారించగలిగామని తెలిపారు. ప్రస్తుతం ఇంకా లీకేజీ కొనసాగుతుందని చెప్పడంతో శాశ్వత పరిష్కారం ఏం చేయబోతున్నారని అధికారులను నిపుణుల కమిటీ సభ్యులు ప్రశ్నించారు. త్వరలోనే సింక్ హోల్ వద్ద జియో మైన్ ద్వారా లీకేజీ అరికట్టే చర్యలు చేపట్టబోతున్నామని చెప్పారు. రిజర్వాయర్ నీటి సామర్థ్యం తదితర అంశాలపై చర్చించారు. రిజర్వాయర్‌కు సంబంధించి త్వరలోనే నిపుణుల కమిటీ నివేదికను అందజేయనుంది. కమిటీ సభ్యుల వెంట ఎస్సార్బీసీ సర్కిల్–2 ఎస్‌ఈ లక్ష్మానాయక్, ఈఈ భవాని ప్రసాద్‌రెడ్డి, డీఈలు సాయికిరణ్, మల్లికార్జున, హైడ్రాలజీ డీఈ శిరీష, ఏఈఈ సుధాకర్ ఉన్నారు.


