శ్రీశైలానికి జీరో ఇన్‌ఫ్లో | - | Sakshi
Sakshi News home page

శ్రీశైలానికి జీరో ఇన్‌ఫ్లో

Sep 17 2026 1:50 AM | Updated on Sep 17 2026 1:50 AM

శ్రీశైలంప్రాజెక్ట్‌: శ్రీశైల జలాశయానికి మంగళవారం నుంచి బుధవారం వరకు ఇన్‌ఫ్లో రాలేదు.అయితే జలాశయం నుంచి దిగువ ప్రాజెక్ట్‌లకు 30,913 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఎడమగట్టు జలవిద్యుత్‌ కేంద్రంలో 6.486 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసి నాగార్జునసాగర్‌కు 13,210 క్యూసెక్కుల నీటిని వదిలారు. బ్యాక్‌వాటర్‌ నుంచి కల్వకుర్తి ఎత్తిపోతలకు 2,033 క్యూసెక్కులు, హంద్రీ–నీవా సుజలస్రవంతికి 3,450 క్యూసెక్కులు, ముచ్చుమర్రికి 720 క్యూసెక్కులు, వెలిగొండ ప్రాజెక్ట్‌కు 3,500 క్యూసెక్కులు వదిలారు. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ నుంచి 8,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. బుధవారం సాయంత్రం సమయానికి జలాశయంలో 111.9430 టీఎంసీల నీరు నిల్వగా ఉంది. డ్యాం నీటిమట్టం 861.90 అడుగులకు చేరుకుంది.

‘ఉత్తమ’ అవార్డులకు

దరఖాస్తుల ఆహ్వానం

నంద్యాల(న్యూటౌన్‌): ఉత్తమ జర్నలిస్టు అవార్డులు ఇచ్చేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ సంచాలకులు కె.ఎస్‌. విశ్వనాథన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. కనీసం ఐదు సంవత్సరాల అనుభవం కలిగి ఉన్యన వారు అర్హులని పేర్కొన్నారు. మొత్తం 12 విభాగాల్లో అవార్డులు అందజేస్తున్నారని, పూర్తి వివరాలు https:// mediarelations.ap.gov.in/media వెబ్‌సైట్‌లో ఉన్నాయని తెలిపారు.

గాలేరు– నగరి కాల్వలో ముగ్గురు గల్లంతు

కొలిమిగుండ్ల(అవుకు): చేపల వేటకు వెళ్లి అవుకు మండలంలోని చెర్లోపల్లె సమీపంలోని గాలేరు– నగరి వరద కాల్వలో ముగ్గురు గల్లంతయ్యారు. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బేతంచెర్లకు చెందిన దర్వేష్‌ మహ్మద్‌ జీవనోపాధి నిమిత్తం రామాపురంలోని పాలీష్‌ ఫ్యాక్టరీలో పని చేస్తున్నారు. సాయంత్రం ఆరేళ్ల కుమారుడు ఆశీక్‌తో పాటు మహ్మద్‌గౌస్‌, మరో ఇద్దరు కలిసి కాల్వలో చేపల వేటకు వెళ్లారు. బాలుడు కాల్వలో జారి పడటంతో తండ్రితో పాటు మిగిలిన ఇద్దరు కాపాడేందుకు దూకారు. ఇందులో ఇద్దరికి ఈత రావడంతో క్షేమంగా బయటకు వచ్చారు. తండ్రి, కుమారుడుతో పాటు మహ్మద్‌ గౌస్‌ ఆచూకీ లభించలేదు. నాలుగు రోజుల క్రితం అధికారులు గాలేరు కాల్వ ద్వారా వైఎస్సార్‌ కడప జిల్లాకు నీటిని విడుదల చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కాల్వ వద్దకు చేరుకోని పరిశీలించారు. రాత్రి కావడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతుంది. ప్రమాదం విషయం తెలియడంతో రామాపురం, చెర్లోపల్లె గ్రామాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున చేరుకున్నారు.

వీఆర్‌ఏల ‘సహాయ నిరాకరణ’

నంద్యాల(అర్బన్‌): తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వీఆర్‌ఏలు సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించారు. నంద్యాల పట్టణంలోని ఎన్‌కే రోడ్డులో నిరసన తెలిపారు. ఈ సందర్‌భంగా వీఆర్‌ఏల సంఘం జిల్లా అధ్యక్షుడు నారాయణ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతున్నా వీఆర్‌ఏలకు ఒక్కరూపాయి వేతనం కూడా పెంచలేదన్నారు. వీఆర్‌ఏలకు వీఆర్‌ఓలుగా ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్‌ చేశారు. మరణించిన వీఆర్‌ఏల స్థానంలో వయస్సుతో సంబంధం లేకుండా కుటుంబ సభ్యులను నియమించాలన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు.

ఆశాలపై పనిభారం తగ్గించాలి

గోస్పాడు: ఆశా వర్కర్లపై పనిభారం తగ్గించి, కనీసవేతనం రూ.26 వేల ఇవ్వాలని ఏపీ ఆశా వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షురాలు రమణకుమారి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆశా వర్కర్లతో కలసి ఇన్‌చార్జ్‌ జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ శారదాబాయికి బుధవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో ఈనెల 24 వరకు జరిగే లెప్రసీ సర్వేలో ఆశా వర్కర్లకు మినహాయింపు ఇవ్వాలన్నారు. సీఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు, ఆశా వర్కర్ల యూనియన్‌ నాయకులు కృపావతి, వెంకటేశ్వరమ్మ, వెంగమ్మ, సువర్ణ, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement