మహిళలకు ఉచిత శిక్షణ | - | Sakshi
Sakshi News home page

మహిళలకు ఉచిత శిక్షణ

Sep 17 2026 1:50 AM | Updated on Sep 17 2026 1:50 AM

అనాలోచిత నిర్ణయంపై ఆగ్రహం ● సాధువులు, సన్యాసులు, భిక్షువులు క్షేత్రాన్ని విడిచి వెళ్లాలనడం తగదు ● ఈ నిర్ణయం తీసుకున్న అధికారులపై చర్యలు తీసుకోవాలి ● ఈ నెల 23వ తేదీలోపు నిర్ణయం ఉపసంహరించుకోకుంటే నిరసనలు బీఈడీ రీవాల్యుయేషన్‌ ఫలితాలు విడుదల

కర్నూలు(అగ్రికల్చర్‌): కర్నూలు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన మహిళలకు కెనరా బ్యాంక్‌ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ఈ సంస్థ డైరెక్టర్‌ కే.పుష్పక్‌ తెలిపారు. కొవ్వొత్తుల తయారీలో 12 రోజులు, జూట్‌ బ్యాగుల తయారీలో 14 రోజులు ఉచితంగా శిక్షణ ఇస్తున్నట్లు ఆయన బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 17వ తేదీ నుంచి శిక్షణ మొదలవుతుందని పేర్కొన్నారు.19 నుంచి 50 ఏళ్లలోపు వయస్సు మహిళలు అర్హులని, తెలుగులో చదవడం, రాయడం వచ్చి ఉండాలని, శిక్షణా కాలంలో ఉచిత భోజనం, హాస్టల్‌ వసతి కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన వారు నాలుగు ఫొటోలు, రేషన్‌కార్డు, ఆధార్‌, బ్యాంకు ఖాతా, విద్యార్హత ధ్రువపత్రాల జిరాక్స్‌ కాపీలతో సంస్థ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు కర్నూలు శివారు బి.తాండ్రపాడు సమీపంలోని కెనరా బ్యాంకు– గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ (డీఆర్‌డీఏ–టీటీడీసీ పక్కన)లో సంప్రదించవచ్చన్నారు. అలాగే 08518–273710, 85002 72720, 90007 10508, 94409 05477 నంబర్లకు ఫోన్‌ చేయవచ్చని తెలిపారు.

ఆగంతకుల హల్‌చల్‌

కర్నూలు(హాస్పిటల్‌): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో మహిళా హౌస్‌సర్జన్ల వసతి గదుల వద్దకు మంగళవారం రాత్రి ఇద్దరు ఆగంతకులు రావడంతో కలకలం రేగింది.పేయింగ్‌ బ్లాక్‌ పై అంతస్తులో ఉన్న హౌస్‌ సర్జన్ల గది వద్దకు అర్ధరాత్రి దాటాక ఇద్దరు వ్యక్తులు వచ్చి తలుపు తట్టారు.తలుపులు తెరిచి చూడగా గుర్తుతెలియని వ్యక్తులు కనిపించే సరికి వైద్య విద్యార్థినులు భయాందోళనకు గురయ్యారు. ఎవరు మీరని ప్రశ్నించగా గతంలో ఇక్కడ క్యాన్సర్‌ వార్డు ఉంది కదా అందుకే వచ్చామని మద్యం మత్తులో పొంతన లేని సమాధానాలు చెప్పారు. దీనిపై వైద్య విద్యార్థినులు ఆసుపత్రి అధికారులకు సమాచారం ఇవ్వగా, వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అక్కడికి చేరుకొని ఆగంతకులను అదుపులోకి తీసుకుని మూడవ పట్టణ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. వారిలో ఒకరు న్యాయవాది, మరికరు విలేకరి అని చెప్పినట్లు సమాచారం. వైద్య విద్యార్థినుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.

శ్రీశైలంటెంపుల్‌: సనాతన ధర్మం, హిందూ సమాజం, దేవదాయశాఖ నిబంధనలపై అవగాహన లేని శ్రీశైల దేవస్థాన ఉన్నతాధికారి అనాలోచిత నిర్ణయాలు సాధువులు, సన్యాసులకు శాపంగా మారాయని శ్రీశైలం సాధు భవన్‌ ట్రస్ట్‌ విమర్శించింది. ఈ మేరకు బుధవారం దేవస్థాన పరిపాలన భవనంలో ఈఓ శ్రీనివాసరావును ఏపీ సాధు పరిషత్‌ గౌరవాధ్యక్షుడు అట్లూరి నారాయణరావు, అధ్యక్షుడు శ్రీనివాసనంద సరస్వతి స్వామిజీ, ప్రధాన కార్యదర్శి అరవింద స్వామిజీ, స్థానిక అశ్రమాల పీఠాధిపతులు, నిర్వాహకులు, సాధువులు కలిసి వినతిపత్రం అందించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. దేశం నలుమూలల నుంచి సాధుసంతులు, జ్ఞానులు, పుణ్యపురుషులు, భిక్షువులు, అవధూతలు, సిద్దులు, గురువులు, అశ్రమ పీఠాధిపతులు శ్రీశైల మహాక్షేత్రానికి అనునిత్యం తరలివస్తుంటారని, వారి వలన క్షేత్రానికి ఎలాంటి నష్టం జరదన్నారు. శ్రీశైలంలో ఉంటున్న సాధువులు, సన్యాసులను క్షేత్రానికి 250 కి.మీ దూరంలో వదిలిపెట్టాలని గత నెల 19న ప్రకటించిన నిర్ణయాన్ని తక్షణమే రద్దు చేయాలని వారు డిమాండ్‌ చేశారు. ఈ అనాలోచిత నిర్ణయం తీసుకున్న అధికారులను తక్షణమే విధుల నుంచి తొలగించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సనాతన ధర్మం, శ్రీశైలక్షేత్ర మహిమ గురించి తెలియకుండా ఎలా విధులు నిర్వహిస్తారని ప్రశ్నించారు. దీనిపై ఈ నెల 23వ తేదీలోపు ఈఓ శ్రీనివాసరావు తగు నిర్ణయాన్ని మీడియా పూర్వకంగా వెల్లడించాలని లేని పక్షంలో ఈ నెల 23న ట్రస్ట్‌బోర్డు మీటింగ్‌ పురస్కరించుకుని ఆంధ్ర–తెలంగాణ సాధు సంతులు, ఆశ్రమాల స్వామిజీలతో కలిసి శ్రీశైల దేవస్థాన ట్రస్ట్‌బోర్డు చైర్మన్‌ను కలిసి వినతిపత్రం సమర్పిస్తామని, అప్పటికి పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్త అందోళనలు చేపడతామని స్పష్టం చేశారు. అంతకుముందు వీరంతా శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కర్నూలు కల్చరల్‌: బీఈడీ నాల్గో సెమిస్టర్‌ రీ వాల్యుయేషన్‌ ఫలితాలను విడుదల చేశారు. రాయలసీమ యూనివర్సిటీ వైస్‌చాన్సలర్‌ ప్రొఫెసర్‌ వి.వెంకట బసవరావు ఆదేశాల మేరకు ఫలితాలను విడుదల చేసినట్లు వర్సిటీ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ డాక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్లు తెలిపారు. ఫలితాలను https:// rayalseemauniversity.ac.in అనే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. మొత్తం 430 మంది విద్యార్థులు 526 పేపర్స్‌కు రీ వాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకోగా 312 మంది 367 పేపర్లలో ఉత్తీర్ణులైనట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement