అంతర్‌ జిల్లా సైబర్‌ మోసగాళ్ల అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

అంతర్‌ జిల్లా సైబర్‌ మోసగాళ్ల అరెస్ట్‌

Sep 18 2026 2:03 AM | Updated on Sep 18 2026 2:03 AM

కోవెలకుంట్ల: స్థానిక పోలీస్‌ సర్కిల్‌ కార్యాలయ పరిధిలో జరిగిన సైబర్‌ నేరాలకు సంబంధించిన మోసగాళ్లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. విజయనగరం పట్టణానికి చెందిన కొలుసు శ్రీకాంత్‌, విజయవాడకు చెందిన సనపాల సాయి ప్రకాష్‌నాయుడును సైబర్‌ నేరస్తులుగా గుర్తించి అరెస్ట్‌ చేశారు. నిందితుల వద్ద నుంచి రూ. 25 లక్షల నగదు, నాలుగు మొబైల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. గురువారం నంద్యాల పట్టణంలోని జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఎస్పీ సునీల్‌ షోరాణ్‌ నిందితులను మీడియా ఎదుట హాజరు పరిచి వివరాలను వెల్లడించారు.

బాధితులు ఇలా మోసపోయారు..

● సంజామల మండలం కానాలకు చెందిన దన్నాడ మల్లికార్జున సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. 2024 డిసెంబర్‌ 2వ తేదీన ఇన్‌స్ట్రాగామ్‌లో స్టాక్‌ మార్కెట్‌కు సంబంధించిన ఒక ప్రకటన చూసి దానిని ఓపెన్‌ చేయగా ఆర్యప్రాజెక్ట్‌ పల్స్‌ ఎక్స్‌బీ అనే వాట్సాప్‌ గ్రూపులో చేరితే స్టాక్‌మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టి అధిక లాభాలు పొందవచ్చని సైబర్‌ మోసగాళ్లు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని నమ్మించారు. ఒక పెట్టుబడి ఖాతాను సృష్టించి వేర్వేరు బ్యాంకు ఖాతాలకు డబ్బులు బదిలీ చేయించారు. బాధితుడు రూ. 22.80 లక్షలు పెట్టుబడుల నిమిత్తం ఆయా ఖాతాలకు జమ చేశాడు. తర్వాత అతని పెట్టుబడి ఖాతాలోరూ. 1.44 కోట్లు ఉన్నట్లు తప్పుడు వివరాలు చూపించారు. ఆ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవాలంటే మరో రూ. 25 లక్షలు ట్యాక్స్‌ రూపంలో చెల్లించాలని డిమాండ్‌ చేశారు. మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు వెంటనే జాతీయ సైబర్‌క్రైమ్‌ హెల్ప్‌లైన్‌ 1930కి కాల్‌ చేసి సమాచారమందించాడు. అనంతరం సంజామల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా 2025 జనవరి నెలలో పోలీసులు కేసు నమోదు చేశారు.

● కోవెలకుంట్ల మండలం రేవనూరుకు చెందిన చరణ్‌రాజ్‌ అనే యువకుడు ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆయన తండ్రి సుబ్బరాయుడు ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తూ అనారోగ్య పరిస్థితుల కారణంగా ఇంటి వద్ద ఉంటున్నాడు. ఆ ఉద్యోగాన్ని కుమారుడికి ఇవ్వాలంటే ఆర్టీసీ సంస్థ పేరుతో తీసుకున్న రుణాన్ని పూర్తిగా చెల్లించాలని ఆర్టీసీ అధికారులు కోరగా గత ఏడాది డిసెంబర్‌ 23వ తేదీన కోవెలకుంట్ల ఎస్‌బీఐ మెయిన్‌ బ్రాంచ్‌లో బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి రూ. 5.24 లక్షలు రుణం తీసుకున్నాడు. ఆ మొత్తం తన బ్యాంకు ఖాతాలో జమ అయిన వెంటనే సైబర్‌ నేరగాళ్లు చరణ్‌రాజ్‌ వాట్సాప్‌కు ఏపీకే ఫైల్‌ పంపించారు. అది ఓపెన్‌ చేయగానే సెల్‌ఫోన్‌ హ్యాక్‌ కావడంతో నేరగాళ్లు ఆ మొత్తాన్ని వేర్వేరు ఖాతాలకు బదిలీ చేసుకున్నారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రేవనూరు స్టేషన్‌లో కేసు నమోదైంది.

రెండు సైబర్‌ నేరాలను

చేధించిన పోలీసులు

రూ. 25 లక్షల నగదు, ల్యాప్‌టాప్‌,

సెల్‌ఫోన్లు స్వాధీనం

వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement