● రెండు బైక్‌లను ఢీకొన్న కారు
● ఒకరు మృతి, మరొకరి పరిస్థితి విషమం
హాలహర్వి: కర్ణాటక సరిహద్దు కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో 167వ జాతీయ రహదారిపై చింతకుంట గ్రామ సమీపంలో గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందారు. కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్ వైపు వస్తున్న కారు ఎదురుగా వస్తున్న రెండు బైక్‌లను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మాచనూరు గ్రామానికి చెందిన దళవాయి శివకుమార్(25) అక్కడికక్కడే మృతిచెందాడు. మరో బైక్‌పై వస్తున్న కర్ణాటకలోని బళ్లారి జిల్లా వీరాపురం గ్రామానికి చెందిన దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. మాచనూరు గ్రామానికి చెందిన మారెన్న, అంబమ్మ దంపతుల పెద్ద కుమారుడు దళవాయి శివకుమార్‌కు ఐదు నెలల క్రితం రాజేశ్వరితో వివాహమైంది. శివకుమార్ బళ్లారి జిల్లా కారేకల్లు గ్రామంలోని ఫ్యాక్టరీ ఏ–1 కంపెనీలో మెకానిక్‌గా పనిచేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉండేవాడు. గురువారం మధ్యాహ్నం విధులకు హాజరయ్యేందుకు బైక్‌పై వెళ్తుండగా బళ్లారి నుంచి ఆదోని వైపు వస్తున్న కారు వేగంగా వచ్చి ఢీకొంది. శివకుమార్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. అతని వెనుక మరో బైక్‌పై వస్తున్న బళ్లారి జిల్లా వీరాపురం గ్రామానికి చెందిన దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం బళ్లారి ఆసుపత్రికి తరలించారు. శివకుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బళ్లారి ఆసుపత్రికి తరలించారు. కర్ణాటకలోని పీడీహళ్లి (హగరి) పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు. ఉన్న ఒక్కగానొక్క కుమారుడు శివకుమార్ మృతిచెందడంతో బాధితా కుటుంబ సభ్యులు బోరున లపిస్తున్నారు.


