● మాజీ ఎంపీ బుట్టా రేణుక
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో అర్ధంతరంగా నిలిచిపోయిన ఇన్‌పేషెంట్ డిపార్ట్‌మెంట్ (ఐపీడీ) భవన నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంటు సమన్వయకర్త, మాజీ ఎంపీ బుట్టా రేణుక డిమాండ్ చేశారు. గురువారం ఆమె కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో నిలిచిపోయిన ఐపీడీ భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాడు–నేడు కింద గత వైఎస్సార్‌సీపీ భుత్వం చేపట్టిన పనుల్లో దాదాపు 70 శాతం సివిల్ పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులకు అవసరమైన నిధులు కేటాయించి త్వరితగతిన పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ భవనం పూర్తయితే 600కు పైగా పడకలు, 14 ఆధునిక ఆపరేషన్ థియేటర్లు అందుబాటులోకి వస్తాయన్నారు. నిర్మాణ పనులు పూర్తిగాకపోవడంతో ఆపరేషన్ థియేటర్ల కొరత ఏర్పడి రోగులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కర్నూలుతో పాటు రాయలసీమ, కర్ణాటక, తెలంగాణ ప్రాంతాల ప్రజలకు సేవలందించే కీలక ఆసుపత్రి అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. పెండింగ్ పనులకు నిధులు కేటాయించి త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు పూర్తిస్థాయి వైద్యసేవలు అందుబాటులో తీసుకురావాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.


