తోడు‘నడక’గా..
చిన్న సమస్యలకే భార్యాభర్తలు గొడవపడుతూ పోలీస్‌స్టేషన్ల చుట్టూ తిరుగుతూ ఉండటాన్ని చూసి ఉంటాం. విడాకులు కావాలని కోర్టు ఎక్కేవారిని గమనించి ఉంటాం. భార్య అనారోగ్యం పాలైతే తన భుజాలపై మోస్తూ భిక్షాటన చేసేభర్త శుక్రవారం బేతంచెర్లలో కనిపించాడు. ఒక ఊరును చిరునామాగా చేసుకోకుండా బాటసారిగా తిరుగుతున్న ఈయన కథ ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. ఆకలి తీర్చుకునేందుకు డబ్బుల్లేకున్నా.. నిద్రపోవడానికి కాసింత స్థలం కనిపించకపోయినా.. బంధువులు లేకున్నా ఈయన ధైర్యాన్ని వీడలేదు. నడవలేని తన సహచరికి ఈ లోకాన్ని చూపుతూ అందరికీ ఆదర్శంగా నిలిచాడు. ఇంతకష్టం ఎందుకు అని ప్రశ్నించగా ఆయన తన దీనగాథను చెప్పారు. ‘మాది గుంటూరు జిల్లా నరసరావుపేట. నా పేరు శ్రీను. నా భార్య పేరు లక్ష్మి. మేం 13 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నాం. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న మాకు రెండుడున్నరేళ్ల క్రితం ఆడపిల్ల పుట్టింది. పసిబిడ్డ ఐదు నెలల వయస్సులోనే అనారోగ్యంతో మృతి చెందింది. ప్రసవసమయంలో నా భార్య లక్ష్మి వెన్నుపూస వద్ద సమస్య వచ్చి నడవ లేని పరిస్థితి నెలకొంది. వైద్యం చేయించినా మార్పు లేకపోయింది. కూలి పనులు చేసే మా వద్ద డబ్బుల్లేవు. ఇల్లు కూడా లేదు. నా భార్య భుజాలపైన మోస్తూ భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నా. ఎవరైనా దానం చేస్తే తింటాం. లేదంటే పస్తులే. ఊరూరా తిరుగుతున్నాం. రాత్రి సమయంలో దేవాలయాలు, బస్, రైల్వే స్షేషన్లలో తలదాచుకుంటాం. ఇద్దరం తోడుగా ఉన్నందుకు మాకు ఆనందంగా ఉంది.’ అని వివరించారు. – బేతంచెర్ల


