ఓబులేశుడి బ్రహ్మోత్సవాలు చూద్దాంరండి! | - | Sakshi
Sakshi News home page

ఓబులేశుడి బ్రహ్మోత్సవాలు చూద్దాంరండి!

Feb 22 2026 8:32 AM | Updated on Feb 22 2026 8:32 AM

ఓబులే

ఓబులేశుడి బ్రహ్మోత్సవాలు చూద్దాంరండి!

● నవ నారసింహ క్షేత్రం.. దినదిన ప్రవర్థమానం ● అడుగడుగున గుడి.. గుడిగుడికీ ఓ దేవుడు ● నాటి ‘అహోబలమే’ నేటి ‘అహోబిలం’ ● నేటి నుంచి ఓబులేశుడి బ్రహ్మోత్సవాలు ● భారీగా హాజరుకానున్న భక్తజనం

● నవ నారసింహ క్షేత్రం.. దినదిన ప్రవర్థమానం ● అడుగడుగున గుడి.. గుడిగుడికీ ఓ దేవుడు ● నాటి ‘అహోబలమే’ నేటి ‘అహోబిలం’ ● నేటి నుంచి ఓబులేశుడి బ్రహ్మోత్సవాలు ● భారీగా హాజరుకానున్న భక్తజనం

ఆళ్లగడ్డ: దేవలంతా ఒక్కటై ఇలపైకి వచ్చేందుకు ముహూర్తం సమీపించింది. శ్రీ అహోబిల లక్ష్మీనరసింహుల కల్యాణ మహోత్సవాన్ని కనులారా తిలకించేందుకు ముల్లోకాల్లోని దేవతా మూర్తులంతా కదలి రానున్నారు. శ్రీమద్‌ అహోబిల బ్రహ్మోత్సవాలు అంటే స్వామిని కొలిచే ప్రతి ఇంటా పండుగే. నల్లమల్ల అడవిలో వెలిసిన ఎగువ అహోబిలం క్షేత్రంలో శ్రీ జ్వాలా నరసింహస్వామి, దిగువలో శ్రీ ప్రహ్లాదవరద మూర్తులు కొలువై ఉన్నారు. ఎగువలో ఈనెల 22వ తేదీ నుంచి, దిగువలో 23వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు మొదలు కానున్నాయి. ప్రపంచలో ఏ వైష్ణవ క్షేత్రంలో కూడా వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఒకే అలంకరణ, ఒకే వాహన సేవలు వరుసగా రెండు రోజుల పాటు కొనసాగించరు. ఒక అహోబిల క్షేత్రానికే ఇది ప్రత్యేకం. ముందు రోజు శ్రీ జ్వాలా నరసింహస్వామికి జరిగిన ఉత్సవం, అలంకరణ, వాహన సేవలు మరుసటి రోజు శ్రీ ప్రహ్లాదవరదస్వామికి నిర్వహించడం ఆనవాయితీ. ఎగువ, దిగువ దేవాలయంలో చుట్టూ మహా భక్తులైన ఆల్వార్లు కొలువై ఉన్నారు. వీరికి ముఖ్య వేళల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. లక్ష్మీనరసింహస్వామితో పాటు ఈ మూర్తులకు పూజలు చేసుకుని భక్తులు పరమానందం పొందనున్నారు.

రూపం ఉగ్రం.. మనస్సు శాంతం

రాక్షస రాజైన హిరణ్యకశిపుణి రాజ్యం ఇది. తన భక్తుడైన ప్రహ్లాదుడిని రక్షించేందుకు హిరణ్యకశపుణ్ణి సంహరించేందుకు లక్ష్మీనరసింహ స్వామి ఉక్కు స్తంభంలోంచి ఉద్భవించిన (చీల్చుకుని వచ్చిన) స్థలం అహోబిల పుణ్యక్షేత్రం. నరసింహస్వామి ఉగ్ర రూపంలో ఆవిర్భవించి హిరణ్యకశిపుణ్ని తన గోళ్లతో చీల్చి చంపినప్పుడు ఆయన బలాన్ని, శక్తిని దేవతలు ‘అహో బలం.. అహో బలం’ అని ప్రశంసించడంతో ఈ స్థలం అహోబిలం అయ్యింది. ఉగ్ర నరసింహస్వామిని పరమశివుడు ‘ఉగ్రం వీరం మహావిష్ణుం’ అనే నరసింహ మంత్రం జపించి శాంతింప జేసి శాంత స్వరూపుడిని చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. అందుకే దిగువ అహోబిలం కొలువైన స్వామిని శాంతమూర్తిగా కొలుస్తారు. ఎగువ అహోబిలంలో స్వామి జ్వాలా నరసింహుడై స్వయంభూగా అవతరించగా, దిగువ అహోబిలంలో శ్రీ వేకంటేశ్వరస్వామి చేత ప్రతిష్టించబడి ప్రహ్లాదవరదుడిగా కొలువై కొలిచే వారికి కొంగు బంగారంగా విరాజిల్లుతున్నారు.

నవ నారసింహులు కొలువైన క్షేత్రం

నరహరి తన అవతారాన్ని భక్తుల కోసం తొమ్మిది ప్రదేశాల్లో ప్రకటించాడు కనుక దీనిని నవనారసింహ క్షేత్రం అంటారు. అన్ని ఆలయాల్లో దేవతా విగ్రహాలు ఉన్నా .. ఆళ్వారులు దర్శించి దేవదేవుని స్తుతించిన వైష్ణవ క్షేత్రాలు కొన్నింటిని మాత్రమే దివ్య క్షేత్రాలు అని అంటారు. ఇలాంటివి ఇలపై 108 ఉండగా వాటిలో ప్రముఖమైనది అహోబిల క్షేత్రం. 6వ శతాబ్ధి నుంచి 12 మంది ఆళ్వారులలో ఒకరైన చివరి తిరుమంగ ఆళ్వార్‌ మంగళ శాసనం చేసినందున 10వ క్షేత్రమైంది. అందుకనే ఇక్కడ శ్రీ కల్యాణ వెంకటేశ్వరస్వామి సన్నిధి, కల్యాణ మంటపాలు కూడా ఉన్నాయి. స్వామి వారి కల్యాణానికి తిరుమల నుంచి పట్టు పీతాంబరాలు ఇప్పటికీ వస్తాయి. సుదర్శన పీఠం మీద గరుత్మంతుడు, ఆయన పైన స్వామి ఉన్నట్లు ఉంటుంది. తూర్పు ముఖంగా కొలువైన స్వామి చతుర్భుజుడై రెండు హస్తాలతో శంఖ, చక్రాలను ధరించగా, ఒక చేత్తో భక్తులకు అభయమిస్తూ, ఇంకొక చేతితో లక్ష్మీదేవిని పట్టుకుని ఉంటారు. శిరస్సు మీద ఆదిశేషుడు, మెడలో సాలగ్రామ మాలతో స్వామిని శాంతమూర్తిగా కొలుస్తారు. అద్భుతమైన శిల్పకళతో అమృతవల్లీ అమ్మవారిని చూడవచ్చు.

నేటి నుంచి బ్రహ్మోత్సవాలు

ఎగువ అహోబిలంలో..

22వ తేదీన ధ్వజారోహణం, భేరి పూజ, రాత్రి సింహ వాహనం

2న రథోత్సవం

3న చక్రస్నానం, ద్వాదశ ఆరాధనం, పుష్పయాగం, రాత్రి గరుడోత్సవం, ధ్వజావరోహణం

4న తీర్థవారి చక్రస్నానం

దిగువ అహోబిలంలో..

22వ తేదీన ఉత్సవాలకు అంకురార్పణం

23న ధ్వజారోహణం, భేరి పూజ, రాత్రి సింహ వాహనం

3న రథోత్సవం

4న చక్రస్నానం, ద్వాదశ ఆరాధనం, పుష్పయాగం, రాత్రి గరుడోత్సవం, ధ్వజావరోహణం

ఓబులేశుడి బ్రహ్మోత్సవాలు చూద్దాంరండి! 1
1/4

ఓబులేశుడి బ్రహ్మోత్సవాలు చూద్దాంరండి!

ఓబులేశుడి బ్రహ్మోత్సవాలు చూద్దాంరండి! 2
2/4

ఓబులేశుడి బ్రహ్మోత్సవాలు చూద్దాంరండి!

ఓబులేశుడి బ్రహ్మోత్సవాలు చూద్దాంరండి! 3
3/4

ఓబులేశుడి బ్రహ్మోత్సవాలు చూద్దాంరండి!

ఓబులేశుడి బ్రహ్మోత్సవాలు చూద్దాంరండి! 4
4/4

ఓబులేశుడి బ్రహ్మోత్సవాలు చూద్దాంరండి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement