బస్సుల కొరత..ఆటోలే దిక్కు!
లింగంపల్లి గ్రామానికి ఆటోలో వెళ్తున్న
విద్యార్థులు
హొళగుంద: మండలంలోని లింగంపల్లితో పాటు వందవాగిలి, ముద్దటమాగి, కోగిలతోట తదితర గ్రామాలకు అదనపు బస్సులతో పాటు వేళకు బస్సులు నడపాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. లింగంపల్లికి చెందిన దాదాపు 60 మంది విద్యార్థులు హెబ్బటం జెడ్పీ ఉన్నత పాఠశాలలో, అలాగే మరికొందరు హొళగుందలోని జూనియర్ కళాశాలలో చదువుకుంటున్నారు. హొళగుంద – ఢణాపురం రోడ్డు దారుణంగా ఉండటంతో ఇటీవల కాలంలో బస్సు సర్వీసులను తగ్గించడం, కండిషన్ లేని బస్సులు నడపడం తదితర కారణాలతో సమయానికి రాలేక పోవడం, కొన్ని బస్సులు చెడిపోతుండడంతో ప్రయాణికులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో ఆటోలు, ఇతర ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ప్రమాదమని తెలిసినా తప్పని పరిస్థితుల్లో ఒక్కో ఆటోలో 20 నుంచి 25 మంది వరకు ప్రయాణం చేస్తున్నారు. అధికారులు స్పందించి రోడ్డును బాగుచేసి వేళకు బస్సులు నడపాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.


