వైద్యరంగంలో నిరంతర శోధన తప్పనిసరి
ఎన్‌టీఆర్ హెల్త్ వర్సిటీ
కర్నూలు(హాస్పిటల్): వైద్యరంగంలో నిరంతర శోధన తప్పనిసరి అని, వైద్యశాస్త్రంలో నూతన ఆవిష్కరణలు జరుగుతుండాలని డాక్టర్ ఎన్‌టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ పి.చంద్రశేఖర్ అన్నారు. కర్నూలు మెడికల్ కాలేజీలో ఆర్థోపెడిక్ సర్జన్స్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 55వ ఒస్సాపొకాన్–2026 రాష్ట్రస్థాయి సదస్సు శనివారం రెండోరోజుకు చేరుకుంది. ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ పి.చంద్రశేఖర్ మాట్లాడుతూ.. వైద్య రంగంలో నూతన ఆవిష్కరణలకు ఎన్‌టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఎప్పుడూ ప్రోత్సహిస్తుందని చెప్పారు. వైద్యరంగంలో పరిశోధనలు చేసేందుకు ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నామన్నారు. ఆర్థోపెడిక్ రాష్ట్రస్థాయి సదస్సు కర్నూలు మెడికల్ కాలేజీలో నిర్వహించడం మంచి పరిణామన్నారు. ఆర్థోపెడిక్, మెడికల్ ఎడ్యుకేషన్ వ్యవస్థలో రీసెర్చ్, స్కిల్ డెవలప్‌మెంట్, పేషంట్ సేఫ్టీ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రెండోరోజు కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర వ్యాప్తంగా, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వైద్య ప్రముఖులు పాల్గొని ట్రామా మేనేజ్‌మెంట్, స్పైన్ సర్జరీ, జాయింట్ రీప్లేస్‌మెంట్, స్పోర్ట్స్ గాయాలు, పిల్లల ఆర్థోపెడిక్స్ వంటి అంశాలపై డిబేట్‌లు, పేపర్ ప్రజెంటేషన్‌లు, అధునాతన ప్రొసీజర్ల గురించి చర్చించారు. కార్యక్రమంలో కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ, ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు, ఒసాప్కాన్ ప్రెసిడెంట్, సెక్రటరీలు డాక్టర్ అశోక్‌కుమార్, డాక్టర్ విజయకృష్ణారెడ్డి, ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ శ్రీనివాస్, సెక్రటరీలు డాక్టర్ ఇలియాస్ బాషా, కో చైర్మన్ డాక్టర్ రమణ, సైంటిఫిక్ కమిటీ డాక్టర్ రాజయ్య, డాక్టర్ అచ్యుత్‌రావు, జాయింట్ సెక్రటరీ డాక్టర్ రాజేష్, ఏపీఎంసీ అబ్జర్వర్ డాక్టర్ ఎస్.వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
వీసీ డాక్టర్ చంద్రశేఖర్


