‘పది’ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
● జిల్లా రెవెన్యూ అధికారి రాము నాయక్
నంద్యాల: పదో తరగతి పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ 01వ తేదీ వరకు పకడ్బందీగా నిర్వహించాలని, ఇందుకు ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను జిల్లా రెవెన్యూ అధికారి డి.రామునాయక్ ఆదేశించారు. తన చాంబర్‌లో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో రెగ్యులర్ విద్యార్థులు 18,510 మంది, ఒకేషనల్ విద్యార్థులు 6,268 మంది, ప్రైవేటు విద్యార్థులు 257 మంది పదోతరగతి పరీక్షలు రాస్తున్నారన్నార. మొత్తం 25,035 మంది విద్యార్థులకు 130 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారన్నారు. అన్ని పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేయాలన్నారు. డిప్యూటీ తహసీల్దార్లను ఫ్లయింగ్ స్క్వాడ్‌లుగా నియమించాలన్నారు. పరీక్షా కేంద్రాల్లో ఫస్ట్ ఎయిడ్ కిట్లు ఏర్పాటు చేయాలన్నారు. పరీక్ష నిర్వహణ సమయంలో ఎటువంటి ఇబ్బంది తలెత్తినా తక్షణమే పరిష్కరించేలా డీఈఓ కార్యాలయంలో కంట్రోల్ రూం: 9515185150 ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మాల్ ప్రాక్టీస్‌కు అవకాశం లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్ష కేంద్రాల పరిసరాల్లో జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని, గ్రామీణ ప్రాంతాల నుంచి విద్యార్థులు సమయానికి చేరుకునేలా ఆర్టీసీ బస్సు సౌకర్యాలు కల్పించాలన్నారు. సమావేశంలో డీఈఓ జనార్దన్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ సీఐ సూర్యమౌళి, జిల్లా ఖజానా అధికారి లక్ష్మీదేవి, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.


